యెస్ బ్యాంకు మనీలాండరింగ్ కేసు ఛార్జ్ షీట్ లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంచలన విషయాలు వెల్లడించింది. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా నుంచి రూ. 2 కోట్ల విలువైన ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్‌ను కొనుగోలు చేయాల్సిందిగా తన పై కొందరు ఒత్తిడి తెచ్చారని దర్యాప్తులో యెస్ బ్యాంకు సహ వ్యవస్థాపకులు రానా కపూర్ వెల్లడించినట్టు ఈడీ ఛార్జ్ షీట్ లో పేర్కొంది.
ఈ అమ్మకం ద్వారా వచ్చిన మొత్తాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ వైద్యం కోసం న్యూయార్క్ లో గాంధీ కుటుంబం వినియోగించిందని ఆయన వివరించినట్టు ఛార్జ్ షీట్ లో వివరించింది. ఛార్జ్ షీట్ లో ఈడీ తెలిపిన వివరాల ప్రకారం…
ఆ పెయింటింగ్ ను కొనుగోలు చేయడానికి నిరాకరిస్తే గాంధీ కుటుంబంతో సంబంధాలు ఏర్పరచుకోకుండా అడ్డుకోవడమే కాకుండా ‘పద్మభూషణ్’ అవార్డు పొందకుండా అడ్డుకుంటామని రానాను అప్పటి పెట్రోలియం మంత్రి మురళీ దేవరా బెదిరింపులకు గురిచేశారు.
మనీ లాండరింగ్ కేసులో యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు, అతని కుటుంబం, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధావన్, ఇతరులపై ఇటీవల ప్రత్యేక కోర్టులో దాఖలు చేసిన రెండవ అనుబంధ ఛార్జిషీట్లో (మొత్తం మూడవది) రాణా కపూర్ వాంగ్మూలాలను ఈడీ పేర్కొంది.
పెయింటింగ్ కోసం రూ. 2 కోట్ల చెక్కును రానా కపూర్ చెల్లించారు. ఆ అమ్మకం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గాంధీ కుటుంబీకులు న్యూయార్క్ ఆస్పత్రిలో సోనియా వైద్య చికిత్స కోసం వినియోగించారు. ఈ విషయాన్ని ఆ తర్వాత రానాకు మిలింద్ దేవరా(దివంగత మురళీ దేవరా కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ) రహస్యంగా తెలియజేశారు.
అయితే పెయింటింగ్ విషయంలో రానాకు అనేక కాల్స్, మెసేజ్ లు వచ్చాయి. నిజానికి, ఈ డీల్‌కి వెళ్లడానికి రానా చాలా అయిష్టంగా ఉన్నారు. అతని కాల్లు/మెసేజ్‌లను స్పందించకుండా ఈ ఒప్పందాన్ని నివారించడానికి చాలా సార్లు రానా ప్రయత్నించారు.
ఒప్పందాన్ని వేగంగా ఖరారు చేసేందుకు పట్టుదలతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఆ తర్వాత 2010 లో న్యూ ఢిల్లీలోని లోధా ఎస్టేట్ బంగాల్లో ఓ డిన్నర్ కార్యక్రమంలో రానాను కలిశారు. ఆ సమయంలో రానాపై మురళీ దేవరా మరింత ఒత్తిడి తీసుకు వచ్చారు. పెయింటింగ్‌ను కొనుగోలు చేయడంలో మరింత ఆలస్యం చేస్తే రానాపై, రానాకు సంబంధించిన యెస్ బ్యాంకుపై తీవ్రమైన చర్యలు తీసుకుంటామని మురళీ దేవర హెచ్చరించారు.
దీంతో తనకు పెయింటింగ్ ను కొనాలని లేకున్నా, రెండు శక్తివంతమైన కుటుంబాలతో శత్రుత్వం పెంచుకోవడం ఇష్టం లేకపోవడంతో అధిక ధరకు పెయింటింగ్ కొనాలని రానా నిర్ణయానికి వచ్చారు. ప్రియాంక గాంధీ వాద్రా కార్యాలయంలో డీల్ ను ముగించే లాంఛనాలు జరిగాయి.
ఈ సమావేశంలో మిళింద్ దేవరా చురుకుగా వ్యవహరించారు. ఈ డీల్ కోసం, హెచ్ఎస్బీసీ బ్యాంక్‌లోని వ్యక్తిగత ఖాతా చెక్కు ద్వారా రూ 2 కోట్లను రానా చెల్లించారు. కొన్ని నెలల తర్వాత అహ్మద్ పటేల్ నివాసానికి రానా వెళ్లారు. అప్పుడు సోనియా గాంధీకి వైద్య చికిత్స కోసం సరైన సమయంలో గాంధీ కుటుంబానికి సహాయం చేయడంపై రానాను అహ్మద్ పటేల్ అభినందించారు. ఇక పద్మభూషణ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని రానాకు ఆయన చెప్పారు.
అంతకు ముందు రానా కపూర్, దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీఎఫ్ హెచ్ఎల్) ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధావన్ అనుమానాస్పద లావాదేవీల ద్వారా రూ 5,050 కోట్ల విలువైన నిధులను స్వాహా చేశారని ఈడీ ఆరోపించింది.
మార్చి 3, 2020న ఈసీఐఆర్ ను రికార్డ్ చేసిన తర్వాత ఈడీ తన దర్యాప్తును ప్రారంభించింది. విచారణ ప్రారంభమైన తర్వాత తన విదేశీ ఆస్తులను పీఎంఎల్ఏ కింద ఈడీ అటాచ్మెంట్ చేయకుండా రక్షించడానికి రానా కపూర్ అమ్మివేసేందుకు ప్రయత్నించాడని ఛార్జ్ షీట్ పేర్కొంది.