గురుగ్రామ్ పోలీసులు నిన్న రోడ్డుపై నగ్నంగా పరుగెడుతున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇతడిని నైజీరియావాసిగా గుర్తించారు. ఇతని మానసిక స్థితి నిలకడగానే ఉందని, కానీ ఎందుకిలా ప్రవర్తించాడో తెలియడం లేదని వారన్నారు. ఇతడిని సెక్టార్ 10 లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు.
సెక్టార్ 69 లో తులీప్ చౌక్ సమీపంలో రోడ్డుకు అడ్డంగా నగ్నంగా పరుగులు తీస్తున్న ఇతని కారణంగా ట్రాఫిక్ జామ్ అయింది. అతడిని పట్టుకోవడానికి పోలీసులు రాగా వారి నుంచి తప్పించుకోవడానికి దగ్గరలో ఉన్న గ్రామం దిశగా పరుగెత్తాడని, ఇతడిని చూసిన స్థానికులు వెంటనే పట్టుకుని ఓ చెట్టుకు కట్టేశారని ఓ అధికారి చెప్పారు.
ఇతని వివరాలు కనుగొని ఇతనిపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. హర్యానా లోని గురుగ్రామ్ లో తరచూ మాదకద్రవ్యాలతో నైజీరియన్లు పోలీసులకు పట్టుబడుతుంటారు.
బహుశా దీనికి సంబంధించిన ముఠా లోని వ్యక్తిగా ఇతడ్ని భావిస్తున్నారు. తాము అడిగిన ప్రశ్నలకు ఈ నైజీరియన్ సరిగా సమాధానాలు చెప్పడం లేదని పోలీసులు పేర్కొన్నారు.