రాష్ట్రంలో గిరిజనులు, పోడు వ్యవసాయం చేసే రైతులపై అటవీ శాఖ అధికారుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అటవీ అధికారుల అత్యుత్సాహం కారణంగా ఓ పోడు రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలంలోగల లైన్ తండాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. లైన్ తండాలో కొంతమంది రైతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్నారు. దీన్ని అడ్డుకునేందుకు అటవీశాఖ అధికారులు తండాకు వెళ్లారు. అటవీశాఖ అధికారులు రైతులతో వాగ్వాదానికి దిగి, బెదిరించే ప్రయత్నం చేశారు.
అధికారుల తీరుకు నిరసనగా ఓ పోడు రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోడు రైతు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. పోడు భూముల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులను మంత్రులు గతంలోనే ఆదేశించారు. అయితే మంత్రుల ఆదేశాలను అధికారులు పట్టించుకోవడం లేదు.
ఇటీవలే పోడు భూముల వ్యవహరంలో అధికారుల తీరుపై గిరిజన ఎమ్మెల్యేలు సైతం బహిరంగంగానే ఫైర్ అయ్యారు. ప్రభుత్వం రైతుల జోలికి పోవద్దని సూచిస్తున్నా… పట్టించుకోవటం లేదని, దీనిపై సీఎంతోనే తేల్చుకుంటామన్నారు. ఇటు సీఎం కూడా ఈ సమస్యను పరిష్కరిస్తానని గతంలోనే చెప్పారు. కానీ కార్యాచరణ ఇంకా ప్రారంభించాల్సి ఉంది.