అమెరికాకు చెందిన ప్రముఖ నటి మార్లిన్ మన్రో గుర్తుంది కదా.. 1950లలో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో.. అంటే.. 1955వ సంవత్సరంలో బిల్లీ వైడర్ తీసిన ది సెవెన్ ఇయర్ ఇచ్ అనే సినిమాలో మన్రోకు చెందిన ఓ సీన్ ఉంటుంది కదా. కింది నుంచి వచ్చే గాలికి ఆమె స్కర్ట్ పైకి ఎగురుతుంటుంది. ఆ సీన్ అప్పటి కుర్రకారు గుండెల్లో నిద్ర లేకుండా చేసింది. అదే సీన్ తరువాత ఎన్నో సినిమాల్లో తీసిన అలాంటి సీన్లకు ప్రేరణ అయింది. అయితే సరిగ్గా ఆ సీన్‌లో మన్రో ఉన్న భంగిమతో ఓ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దాని పేరు ఫరెవర్ మార్లిన్.
ఫరెవర్ మార్లిన్ విగ్రహం ఎత్తు 26 అడుగులు (సుమారుగా 7.9 మీటర్లు). 15వేల కిలోల బరువు ఉంటుంది. 2011లో ది స్కల్ప్చర్ ఫౌండేషన్‌కు చెందిన సెవార్డ్ జాన్సన్ అనే కళాకారుడు దాన్ని తీర్చిదిద్దాడు. స్టీల్, అల్యూమినియంలతో ఆ విగ్రహాన్ని రూపొందించి తరువాత దానికి పెయింట్ వేశారు. అయితే ఆ విగ్రహాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.
మొదట్లో ఫరెవర్ మార్లిన్ విగ్రహాన్ని షికాగోలో 2011 నుంచి 2012 వరకు ఉంచారు. తరువాత 2012 నుంచి 2014 వరకు ఆ విగ్రహం పామ్ స్ప్రింగ్స్‌లో ఉంది. అనంతరం దాన్ని 2014-15 మధ్య హామిల్టన్ టౌన్‌షిప్‌లో ఏర్పాటు చేశారు. ఆ తరువాత 2016లో ఆస్ట్రేలియాలోని బెండిగోలో కొంత కాలం ఉంచారు. అనంతరం 2018 నుంచి స్టామ్‌ఫోర్డ్‌లోనే ఆ విగ్రహం ఉంది. దాన్ని తిరిగి పామ్ స్ప్రింగ్స్‌కు తరలించాలని చూస్తున్నారు.
అయితే ఆ విగ్రహం పట్ల జనాలు ఆకర్షితులై అది ఉన్న ప్రాంతాల్లో వారు ఎక్కువ సమయం పాటు గడిపేవారు. కానీ స్టామ్ ఫోర్డ్‌లో ఆ విగ్రహాన్ని చర్చి ఎదురుగా పెట్టడం వివాదాస్పదమైంది. అలాంటి పవిత్రమైన ప్రదేశంలో అర్ధనగ్నంగా ఉన్న ఆ విగ్రహాన్ని ఎలా పెడతారు ? అంటూ కొందరు ప్రశ్నించారు. అయినప్పటికీ జనాలు మాత్రం ఆ విగ్రహాన్ని చూసేందుకు, అక్కడ ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపిస్తూనే ఉండడం విశేషం.