మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ను ఏపీపీఎస్సీ చైర్మన్ గా నియమించింది ప్రభుత్వం. ఈ మేరకు గురువారం ప్రకటన వెలువడింది. రెండు రోజుల క్రితమే డీజీపీ పోస్ట్ నుంచి సవాంగ్ బదిలీ అయ్యారు. అయితే.. పోలీస్ శాఖతో సంబంధం లేని పోస్ట్ ను ఆయనకు కేటాయించడంపై చర్చ జరుగుతోంది.
ఎపీపీఎస్సీ చైర్మన్ రాజ్యాంగబద్ధమైన పోస్ట్ కావడంతో నియామక ఉత్తర్వులను గవర్నర్ కు పంపారు. గవర్నర్ ఆమోద ముద్ర పడిన తర్వాత సవాంగ్ పదవీ కాలం ప్రారంభం అవుతుంది. అయితే.. ఆయనకు 2023 వరకు సర్వీస్ ఉన్నందున దాన్ని వదులుకుని వస్తారా? అనేది ఉత్కంఠగా ఉంది.
ఇప్పటికే సవాంగ్ తో ప్రభుత్వం చర్చించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో ఆయన బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ దళాలకు వెళ్లే అవకాశం లేకపోలేదనే చర్చ కూడా సాగుతోంది.
ఎపీపీఎస్సీ ఉద్యోగ నియామకాల సంస్థ. ఇందులో ఐపీఎస్ అధికారుల్ని నియమించడం చాలా అరుదు. అకడమిక్ ఎక్స్ పర్ట్స్ ను ఎక్కువగా నియమిస్తూ ఉంటారు. కానీ.. వైసీపీ ప్రభుత్వం మాత్రం పోలీస్ శాఖకు చెందిన అధికారిని నియమించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.