ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్ మాజీ డైరెక్టర్ జక్కరాజు శివకుమార్(73) అనుమానాస్పదస్థితిలో మృతి చెందారు. హైదరాబాద్‌లోని మలేషియా టౌన్‌షిప్‌లో ఉంటున్న ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఎఫ్‌ఎ్‌సఎల్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఉద్యోగ విరమణ చేసిన తర్వాత బంజారాహిల్స్ రోడ్డు నం. 1లో ఉన్న ట్రూత్ ల్యాబ్స్‌లో పనిచేస్తున్నారు.
విజయవాడ కోర్టులో వాయిదాకు హాజరవ్వడానికి ఆయన హైదరాబాద్ నుంచి శుక్రవారం ఉదయం బయలుదేరారు. మేక్ మై ట్రిప్‌లో బుక్ చేసుకున్న ఎంజీ రోడ్డులోని హోటల్‌లో రూంకు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో చేరారు. రాత్రి వరకు ఆయన ఒక్కరే గదిలో ఉన్నారు. శనివారం ఉదయం అల్పాహారం ఆర్డర్ తీసుకోవడానికి రెస్టారెంట్ సిబ్బంది తలుపుకొట్టారు.
ఆయన తీయకపోవడంతో బయటకు వెళ్లి ఉంటారని భావించారు. తిరిగి మధ్యాహ్నం 1గంటకు గది ఖాళీ చేస్తారో, ఉంటారో తెలుసుకోవడానికి ఇంటర్‌కంకు ఫోన్ చేశారు. ఆయన స్పందించలేదు. దీంతో సిబ్బంది మాస్టర్ కీ తీసుకుని తలుపు తీసి చూడగా శివకుమార్ పడిపోయి ఉన్నారు. గదిలో మద్యం సీసా ఉన్నది. సిగరెట్లు ఎక్కువగా కాల్చిన ఛాయలు కనిపించాయి.
శివకుమార్‌కి బీపీ, షుగర్ ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. మద్యం తాగి నడిచి వెళ్తుండగా తూలడంతో పడి మరణించి ఉంటారని భావిస్తున్నారు. ఆయన వద్ద ఉన్న ఫోన్ నంబర్లతో కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. కేసును మాచవరం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.