ఓ యువకున్ని ఎస్ఐ కొడుతుండగా మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అడ్డుకున్నారు. ఆ యువకున్ని తీసుకుని పోలీసు స్టేషన్‌కు వెళ్లి సదరు ఎస్ఐపై ఫిర్యాదు చేశారు. ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆయన డిమాండ్ చేశారు.
ఇంతకు ఏం జరిగిందంటే…మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి భూపాలపల్లి వెళ్తున్నారు. ఆ సమయంలో భూపాల పల్లిలో మెయిన్ రోడ్డుపై యూనిఫామ్‌లో లేని ఎస్ఐ ఓ యువకున్ని కొడుతూ కనిపించారు. దీంతో ఆయన తన కారును ఆపి ఎస్ఐ అడ్డుకుని ప్రశ్నించారు.
మనం ఏ దేశంలో ఉన్నామని ఆయన ప్రశ్నించారు. అసలు ఆ యువకున్ని ఎందుకు కొడుతున్నారంటూ ఎస్ఐని ఆయన నిలదీశారు. అనంతరం అక్కడ ఉన్న స్థానికులను కనుక్కుంటే ఆ యువకున్ని కొట్టిన వ్యక్తి భూపాల్ పల్లి ఎస్ఐ అని తెలిసింది.
దీంతో బాధిత యువకున్ని తీసుకుని పోలీస్ స్టేషన్‌కు ఆయన వెళ్లారు. అక్కడ ఎస్ఐపై ఆ యువకునితో ఫిర్యాదు చేయించారు. వెంటనే స్థానిక డీఎస్పీ, సీఐలతో ఆయన మాట్లాడారు. దురుసుగా ప్రవర్తించిన ఎస్ఐ మీద కేసు బుక్ చేయాలని డిమాండ్ చేశారు.