టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేశారంటూ ఆయన భార్య ఆండ్రియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు వినోద్ కాంబ్లీపై కేసు నమోదు చేసినట్టు ముంబై పోలీసులు వెల్లడించారు.
వినోద్ కాంబ్లీ మద్యం తాగి వచ్చి తనను కొడుతున్నారని, తిడుతున్నారంటూ ఆయన భార్య ఆండ్రియా హెవిట్ ముంబైలోని బాద్రా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 324(ప్రమాదకరమైన ఆయుధాలతో దాడిచేయడం) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.
తనపై భర్త కుకింగ్ ప్యాన్ ను తనపైకి విసిరేశారని, దీంతో తనకు గాయాలయ్యాయని ఆండ్రియా చెప్పిందని పోలీసులు తెలిపారు. అయితే ఆ కొద్ది సేపటికే పరిస్థితులు చక్కబడ్డాయని, కాంబ్లీపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని ఆండ్రియా అన్నారని పోలీసులు చెప్పారు.
దీంతో ఆయన్ని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం… కాంబ్లీ నిన్న మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంతో తాగి వచ్చారు. మళ్లీ తాగి వచ్చార అంటూ కాంబ్లీని ఆండ్రియా ప్రశ్నించారు. దీంతో ఆమెను కాంబ్లీ తిడుతూ గొడవకు దిగారు.
ఈ క్రమంలో వారి కొడుకు(12) కాంబ్లీని ఆపేందుకు ప్రయత్నించాడు. దీంతో కిచెన్ లోకి వెళ్లి ఆండ్రియాపైకి కుకింగ్ ప్యాన్ విసిరారు. దీంతో ఆండ్రియా తలకు గాయాలయ్యాయి. అక్కడి నుంచి ట్రీట్ మెంట్ కోసం బాబా ఆస్పత్రికి ఆమె వెళ్లారు. అనంతరం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.