మాయమాటలతో వ్యాపారులను మోసం చేస్తూ లక్షలు దండుకున్నాడు ఓ మాజీ క్రికెటర్. ఏపీ ముఖ్యమంత్రి జగన్ పీఏగా నమ్మించి మహారాష్ట్రకు చెందిన వ్యాపారులకు కుచ్చుటోపి వేస్తున్న రంజీ మాజీ ప్లేయర్ బుడుమూరు నాగరాజును ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలోనూ ఈ కేటుగాడు మంత్రి కేటీఆర్ పీఏ అని చెబుతూ అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఈ ఘరానా మోసగాడిపై ముంబై, హైదరాబాద్ లతో పాటు దేశ వ్యాప్తంగా 30కి పైగా కేసులు ఉండటం ఉన్నాయి.
డీటైల్స్ లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుడుమూరు నాగరాజు ఎంబీఏ చదివాడు. 2009లో రాష్ట్ర స్థాయిలో అండర్–19 కేటగిరీలో క్రికెట్ ఆడాడు. ఆ తర్వాత స్టేట్ సౌత్ జోన్ కు ఎంపికై ఆరు రాష్ట్రాల జట్టులతో పోటీపడ్డాడు. ఈ మ్యాచుల్లో గంగా గోవా జట్టుతో ఆడుతున్న సమయంలో నాగరాజు ముక్కుకు తీవ్ర గాయమైంది. దీంతో అతను రెండేళ్ల పాటు క్రికెట్‌కు దూరమయ్యాడు. అనంతరం 2014లో నాగరాజును ఆంధ్రా రంజీ జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అయితే 2016లో నాగరాజు ఓ రికార్డు సృష్టించేందుకు ప్రయత్నించాడు. లాంగెస్ట్ ఇండివిడ్యువల్ నెట్ సీజన్ పేరుతో 82 గంటల పాటు నిర్విరామంగా బ్యాటింగ్ చేయాలని చూశాడు
ఆ తర్వాత నాగరాజు బెట్టింగ్ వైపు మళ్లాడు. మొదట్లో బుకీలతో సంప్రదించి బెట్టింగ్ పెట్టేవాడు. ఆన్‌లైన్ బెట్టింగ్ పెట్టి తీవ్రంగా నష్టపోయాడు. అలా చివరకు డబ్బు కోసం మోసాలు చేయడం స్టార్ట్ చేశాడు. అందుకు అనుగుణంగా ట్రూ కాలర్ యాప్, వాట్సాప్ లను తన నెంబర్ ను ప్రముఖుల పీఏల పేరుతో మార్చుకున్నాడు. అంతేకాదు ప్రముఖుల ఫొటోలను తన వాట్సాప్ డీపీగా పెట్టుకుంటాడు. ఇక 2021లో మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతిరెడ్డిని అంటూ డబ్బు దండుకోవడానికి ప్రయత్నించి బుక్కయ్యాడు.
తాజాగా ముంబైలో ఎలక్ట్రానిక్ షాపులు నిర్వహించే సంస్థ యజమానిని నాగరాజు టార్గెట్ చేశాడు. సీఎం జగన్ ఫొటోను డీపీగా పెట్టుకున్న వాట్సాప్ నెంబర్ తో మెసేజ్ చేశాడు. ఓ క్రికెట్ మ్యాచ్ కు స్పాన్సర్ గా ఉండాలంటూ కోరాడు. వాయిస్ ఫిష్షింగ్ టెక్నాలజీ వినియోగించి గొంతు మార్చి మాట్లాడాడు. ఇది నిజమని నమ్మిన ఆ యజమాని నాగరాజుకు రూ.12 లక్షలు చెల్లించారు.
అయితే ఆ తర్వాత ఆ నెంబర్ కు ఫోన్ చేయగా.. రింగ్ అవడం లేదు. దీంతో మోసపోయాయనని తెలుసుకున్న బాధితుడు.. జనవరి 13న ముంబై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైటెక్ పంథాలో మోసాలు చేస్తున్న నాగరాజును.. సిమ్ కార్డు తన పేరు మీదనే తీసుకున్నాడు. దీని ఆధారంగా ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు నాగరాజును హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకువెళ్లారు.