తనకు కల్పించిన సెక్యూరిటీని కేంద్రం తగ్గించివేసిందని జమ్మూ కాశ్మీర్, మేఘాలయ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆరోపించారు. తనకు జెడ్ ప్లస్ భద్రత కల్పించేబదులు ఓ పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ ని నియమించారని ఆయన చెప్పారు. లోగడ జమ్మూ కాశ్మీర్, మేఘాలయ, గోవా గవర్నర్ గా వ్యవహరించిన ఆయన.. తాను రైతుల సమస్య మీద, అగ్నివీర్ పథకం మీద మాట్లాడినందుకే ఈ చర్య తీసుకున్నారన్నారు. 2019 లో నాడు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉండగా మాలిక్ గవర్నర్ గా వ్యవహరించారు. .
అప్పుడే ఈ ప్రాంతానికి కేంద్రం 370 అధికరణం కింద చరిత్రాత్మక మార్పులు చేసింది. ఈ ఆర్టికల్ కింద దీనికి ప్రత్యేక హోదాను రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్, లడఖ్ పేరిట రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చింది. కొన్ని నెలల అనంతరం మాలిక్ గోవా 18 వ గవర్నర్ అయ్యారు. గత ఏడాది అక్టోబరు వరకు మేఘాలయ గవర్నర్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
ఇప్పుడు మాజీగా మారిన ఆయన.. తానేమీ రాజకీయనేతను కాదని, ఏ పార్టీతోనూ సంబంధాలు లేవని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. భద్రతను తగ్గించినందున తనకేదైనా (హాని) జరిగితే దయచేసి ఢిల్లీకి రావాలని సత్యపాల్ మాలిక్ వ్యాఖ్యానించారు. గోవా గవర్నర్ గా తాను ఉన్నప్పుడు ప్రతిదానిలోనూ అవినీతి జరగడం కనుగొన్నానని తెలిపారు.
బీజేపీ, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నందుకే తనపై కక్ష గట్టి తన భద్రతను కుదించివేసినట్టు మాలిక్ అభిప్రాయపడ్డారు.