మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు పదవులతో సంబంధం లేదన్నారు. పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం మనుషుల్ని మనుషుల్లాగా చూడండని ఆయన అన్నారు. పినపాకలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పైన నమ్మకంతోనే తాను బీఆర్ఎస్‌లో చేరానని పేర్కొన్నారు. కానీ నాలుగేండ్లలో పరిణామాలు మారిపోయాయని, సరైన సమయం వచ్చినప్పుడు వాటిని వివరిస్తానని ఆయన వ్యాఖ్యానించారు.
రాజకీయంగా తనకు ఎవరూ గాడ్ ఫాదర్ లేరని, ప్రజలే తనకు అసలైన గాడ్ ఫాదర్ అని చెప్పుకొచ్చారు. కేటీఆర్ తో వున్న చనువుతోనే తాను ఇన్ని రోజుల పాటు పార్టీలో ఉన్నానన్నారు. తాను సెక్యూరిటీ అడిగినా ఇవ్వలేదన్నారు. సెక్యూరిటీ తగ్గించినా తాను అడగబోనన్నారు.
ఆ ఇద్దరు గన్‌మెన్లను తీసేసినా తనకు ఇబ్బంది లేదన్నారు. ఈ నాలుగేండ్లలో చాలా అవమానాలను భరించానని పేర్కొన్నారు. పినపాకలో తనకు పనేంటని కొందరు తనను అడుగుతున్నారన్నారు. తన ప్రజల సమస్యలను తెలుసుకునేందుకే తాను వచ్చానని సమాధానం ఇచ్చారు.