మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ కి సొంత నియోజకవర్గంలో చేధు అనుభవం ఎదురైంది. అక్కడ స్థానికులు అవంతికి ఝులక్ ఇచ్చారు. గ్రామస్తులు చేసిన పనికి అవంతి శ్రీనివాస్ కూడా షాక్ అయ్యారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ జిల్లా భీమిలి మండలం, కే నగరపాలెం వెళ్లారు. అక్కడ గ్రామస్తులు చెప్పుల దండతో ఆయనకి స్వాగతం పలికారు.
తమ గ్రామంలోకి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా చెప్పుల దండ కట్టి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి వెళ్లి చెప్పుల దండను తొలగించారు. అవంతి శ్రీనివాస్ తమ గ్రామంలోకి రావద్దంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు నిరసనకారులను అడ్డుకున్నారు.
దీంతో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తడంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ తన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ ఘటనపై అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. టీడీపీకి చెందిన కొందరు కావాలనే ఇలా చేశారని ఆరోపించారు.
ఇక్కడ ఇళ్ల స్థలాలకు సంబంధించి కోర్టు పరిధిలో ఉందని.. వాళ్లు కావాలనే రాద్ధాంతం చేశారన్నారు. తాను ఎవరి జోలుకు వెళ్లనని.. తన విషయంలో ఎవరైనా జోక్యం చేసుకుంటే ఊరుకునే ప్రసక్తే లేదని, చట్టపరంగా చర్యలు తీసుకుంటానని అవంతి శ్రీనివాస్ హెచ్చరించారు. ఈ ఘటన గురువారం రాత్రి జరిగింది.