టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఆళ్లగడ్డలోని భూమా అఖిలప్రియ నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు నంద్యాలలోని గాంధీ చౌక్ వద్ద బయటపెడతాననీ భూమా అఖిలప్రియ సవాల్ చేసిన నేపథ్యంలో.. ఆమె నంద్యాలకు వెళ్లకుండా నిరోధించేందుకు పోలీసులు ఆళ్లగడ్డలోనే గృహ నిర్బంధం చేశారు.
పోలీసుల అనుమతి లేకుండా బహిరంగ చర్చకు ఏర్పాటు చేశారని భూమా అఖిలప్రియ ప్రైవేటు కార్యదర్శికి గత రాత్రి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, భూమా అఖిలప్రియ మధ్య రాజకీయ వైరం తారా స్థాయిలో ఉంది. ఇరువురి మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్దం కొనసాగుతోంది.
ఆ వైసీపీ ఎమ్మెల్యే టీడీపీ వైపు ఉందంటూ ఇటీవల భూమా అఖిలప్రియ సంచలన ఆరోపణలు చేశారు. అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ.. శిల్పా రవి టీడీపీ నాయకులతో టచ్ లో ఉన్నారని తెలిసిందనీ, టీడీపీలో చేరేందుకు ప్లాట్ ఫాం సిద్దం చేసుకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు నంద్యాల జిల్లాలో తీవ్ర సంచలనం అయ్యాయి.
ఇదే క్రమంలో శిల్పా రవి అవినీతి, అక్రమాలు బయటపెడతానంటూ అఖిలప్రియ సవాల్ విసిరారు. ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ వద్దకు ఎమ్మెల్య అక్రమాల చిట్టా తీసుకువస్తాననీ, తాను అక్రమాలకు పాల్పడ్డానని వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన ఆరోపణలు ఆధారాలతో సహా నిరూపించాలనీ, లేదంటే క్షమాపణలు చెప్పాలంటూ అఖిలప్రియ డిమాండ్ చేశారు. భూమా అఖిలప్రియ సవాల్ తో పోలీసులు అలెర్ట్ అయ్యారు. భూమా అఖిలప్రియను నంద్యాలకు వెళ్లకుండా ఆళ్లగడ్డలోనే హౌస్ గృహ నిర్బంధం చేశారు. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల తీరుపై అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.