ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి,మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మ ఇవాళ ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 73 సంవత్సరాలు..గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె.. ఇవాళ తెల్లవారుజామున తిరుపతిలోని తన నివాసంలో కన్నుమూశారు.
ఆమె 1949 జూన్ 1 వ తేదీన ప్రకాశం జిల్లా కందుకూరులో జన్మించారు. ఎంబీబీఎస్ పూర్తి చేశారు. అనంతరం కొంత కాలం వైద్య వృత్తిలో కొనసాగారు. 1979 నుంచి 1981 వరకు డాక్టర్స్ సెల్ కన్వీనర్ గా పనిచేసిన ఆమె కొంత కాలం వైద్య వృత్తిలో కొనసాగారు. తరువాత రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగారు.
1979 లో కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కుతూహలమ్మ.. చిత్తూరు జిల్లా యూత్ కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశారు.ఇక 1980 నుంచి 1985 లో చిత్తూరు జిల్లా జెడ్పీ ఛైర్ పర్సన్ గా, కో ఆఫ్షన్ సభ్యురాలిగా సేవలందించారు. మరో వైపు 1985 లో వేపంజేరి నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే రాష్ట్ర విభజన తరువాత 2014 లో కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కుతూహలమ్మ.. టీడీపీలో చేరారు.
2014 లో జరిగిన ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి ఓడిపోయారు. ఇక కుతూహలమ్మ మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఆమెతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు.