ఏపీ సీఐడీ అధికారులు రెండు రోజులుగా మాజీ మంత్రి నారాయణతో పాటు ఆయన కుమార్తెల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన సీఐడీ చేతికి చిక్కినట్టు సమాచారం. అమరావతి భూ లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు అధికారులు.
రాజధాని అవకతవకలపైనే సోదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లోని అయిదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈ సోదాలు నిర్వహించారు. నేడు రెండో రోజు సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ సోదాల సమయంలో సీఐడీకి కీలక ఆధారాలు లభ్యం అయినట్టు తెలుస్తోంది. అందులో కీలకమైన సమాచారం ఉందని.. దీని ఆధారంగా తదుపరి నిర్ణయాల దిశగా సీఐడీ అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
అయితే నాడు మున్సిపల్ మంత్రిగా అమరావతి మాస్టర్ ప్లాన్.. భూ సమీకరణలో కీలకంగా ఉన్నారు నారాయణ. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయం నుంచి అమరావతిలో భూ స్కాం జరిగిందని ఆరోపిస్తోంది. అధికారంలోకి వచ్చిన తరువాత ఈ వ్యవహారం పైన మంత్రి వర్గ ఉప సంఘం నియమించింది. అమరావతి ప్రాంతాన్ని రాజధాని ఖరారు చేసి.. ప్రకటనకు ముందే తన అనుచరులకు మేలు చేసేలా వ్యవహరించారనేది వైసీపీ ఆరోపణ.
ఇదే కేసుకు సంబంధించి గతంలో సీఐడీ మాజీ మంత్రి నారాయణను విచారించింది. ఈ కేసు కోర్టుకు చేరింది. ఇప్పుడు సీఐడీ నారాయణతో పాటుగా ఆయన కుమార్తెలకు సంబంధించి ఇందులో ప్రమేయం పైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం.