ఎప్పట్లాగే ఇప్పుడు కూడా రాయలసీమకు అన్యాయం చేయవద్దని, సీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ సంచలన డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు మాజీ మంత్రులు. ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ చేస్తూ సీనీయర్ నేతలు మైసూరా, శైలజానాథ్, మాజీ డీజీపీ దినేశ్ రెడ్డి జగన్‌కు రాసిన లేఖలో సంతకాలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రం కోసం కర్నూలు ప్రజలు ఎప్పటి నుండో త్యాగాలు చేస్తున్నారని, వారి త్యాగాలు వృధా కాకుండా గ్రేటర్ రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని వీలు కాకపోతే ప్రత్యేక రాష్ట్రం చేయాలని కోరారు. పరిపాలన వికేంద్రీకరణ సమర్థిస్తున్నామని… కానీ గ్రేటర్ రాయలసీమకు ప్రాధాన్యత కూడా ఇవ్వాలని వారు కోరారు.
ఒకప్పుడు తెలుగు జాతి ఐక్యత కోసం రాజధానిని త్యాగం చేసిన సీమ ప్రజల న్యాయమైన కోరిక నేరవేర్చాలని సీఎం జగన్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు ఎప్పుడు కూడా తమకు రాజధాని కావాలని అడగలేదని… కానీ తాము ముందు నుండే రాజధానిని కోరుతున్నామన్న సంగతి లేఖలో గుర్తు చేశారు.
కేటీఆర్‌కు మున్సిపోల్ పరీక్ష..?
ఇక రాజధాని పేరుతో చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మైసూరా రెడ్డి ఆరోపించారు. అంతపెద్ద శ్రీశైలం ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలోనూ రాయలసీమే మునిగిపోయిందని… కానీ నీరు మాత్రం కోస్తాకే వెళ్తుందని వారంతా ఆరోపించారు.
దీంతో… మరోసారి ప్రత్యేక రాయలసీమ ఉద్యమం తెరపైకి వచ్చినట్లయింది. మాజీ మంత్రులు, కీలక నేతలంతా ఇప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టబోతున్నారనే దానికి తాజా లేఖనే ఉదాహరణ అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.