చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో తన భార్యతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. మంగళవారం రాత్రి సీఎం కేసీఆర్ తో ఓదేలు దంపతులు భేటీ అయ్యారు. కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇవ్వడంతో ఆయన టీఆర్ఎస్ లో చేరినట్లు చర్చ సాగుతోంది.
నాలుగు నెలల క్రితమే టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ లో చేరారు ఓదేలు దంపతులు. తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ పార్టీని తిట్టిపోసి ఢిల్లీలో ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ గులాబీ గూటికి చేరారు. ఓదేలు 2009, 2010, 2014 ఎన్నికల్లో చెన్నూరు నుంచి పోటీ చేసి గెలిపొందారు. 2018లో టీఆర్ఎస్ అధిష్టానం బాల్క సుమన్ కు టికెట్ ఇవ్వడంతో పోటీకి దూరంగా ఉన్నారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా.. ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. ఎమ్మెల్సీ అయినా ఇస్తారేమోనని ఆశపడగా.. ఆ విషయంలోనూ నిరాశే ఎదురైంది. చివరకు తన భార్య భాగ్యలక్ష్మిని జెడ్పీటీసీ ఎన్నికల్లో నిలబెట్టి గెలిపించుకున్నారు. మంచిర్యాల జెడ్పీ చైర్ పర్సన్ గా అవకాశం దక్కించుకున్నారు. అయితే.. పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదంటూ బాల్క సుమన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీఆర్ఎస్ ను వీడారు.
కాంగ్రెస్ లో చేరిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఓదేలు. బాల్క సుమన్ తన ఫోన్ ట్యాప్ చేశారని.. తమ ఇంటిపై నిఘా పెట్టారని ఆరోపించారు. ఆయన అరాచకమైన చర్యలు చేయడం వల్లే టీఆర్‌ఎస్ ను వదిలిపెట్టామని స్పష్టం చేశారు. తెలంగాణ మంత్రి వర్గంలో ఉద్యమద్రోహులకే పట్టం కట్టారన్న ఆయన.. సోనియా, రాహుల్ నాయకత్వంలో ప్రియాంక గాంధీ చేతులమీదుగా కాంగ్రెస్ లో చేరినట్లు తెలిపారు. కాంగ్రెస్ బలోపేతం కోసం తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. సీన్ కట్ చేస్తే… నాలుగు నెలలకే ఇవన్నీ మర్చిపోయి మళ్లీ గులాబీ కండువా కప్పుకున్నారు ఓదేలు దంపతులు.