ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మహిళా ద్రోహి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఏడు అడుగులు వేసి రాజ్ భవన్ కు వెళ్తే బిల్లులు ఆమోదం పొందేవన్నారు. రాజకీయం చేయాలనే దురుద్దేశంతోనే బిల్లులపై సుప్రీంకు వెళ్లారని ప్రభాకర్ ధ్వజమెత్తారు.
గ్యాస్ ధరలు పెంచారని సిలిండర్లతో మంత్రులు ఆందోళన చేస్తున్నారు కానీ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లులు, నీటి బిల్లులు, బస్సు చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. కరెంటు, నీటిని వినియోగించకుండా మంత్రులు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.
బీజేపీ వాళ్లు చెబితేనే అరెస్టులు చేస్తున్నారని, ఇక విచారణ సంస్థలు ఎందుకని కేసీఆర్ కుమార్తె కవిత మాట్లాడంపై ప్రభాకర్ మండిపడ్డారు. మద్యం కుంభకోణంలో సాక్ష్యాలు ధ్వంసం చేసిందని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న విషయం ఆమెకు గుర్తులేదా? అని ప్రశ్నించారు. కవితే మద్యం కుంభకోణంలో పెట్టుబడిదారీ, మధ్యవర్తి అని దేశ వ్యాప్తంగా చర్చ నడుస్తోందని సెటైర్లు వేశారు.
సొంత పార్టీలో మహిళా ప్రజా ప్రతినిధుల గురించి పట్టించుకోని కవిత.. మహిళా సాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని విమర్శలు చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరుగుతుంటే కవిత కనీసం స్పందించడం లేదన్నారు. గవర్నర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేస్తే స్పందించిన కవిత.. జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తాననడం విడ్డూరంగా ఉందని విమర్శలు చేశారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్.