తెలుగు రాష్ట్రాలను కంటతడి పెట్టించిన గోదావరిలో పడవ మునక విషాదంలో రాజకీయ జోక్యం ఉందని మాజీ ఎంపీ హర్షకుమార్ తీవ్ర ఆరోపణ చేశారు. గోదావరిలో పడవ మునిగే సమయానికి పడవలో ఉంది 73 మంది కాదని, 93 మంది అని, ఏపీ పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడితోనే అధికారులు మాట మార్చారని విమర్శించారు.
రాజమహేంద్రవరం: గోదావరి విషాదంలో మృతుల వెలికితీత పూర్తికానే లేదు. అసలు ఆరోజు బోటు ఎక్కినవారు ఎంతమందో ఇంతవరకు స్పష్టంగా తేలనేలేదు. ఎవరు తోచిన లెక్క వారు చెబుతున్నారు. టూరిజం అఫీషియల్ బోట్లు వున్నా ప్రైవేట్ బోట్లు ఎందుకు తిప్పుతున్నారో అది ఆ శాఖకే తెలియాలి. ఖరీదైన టూరిజం బోటుని రిపేర్ల పేరుతో ఎప్పుడూ పక్కనే వుంచుతారు. అందులో మర్మమేంటో మొన్న పడవ విషాద బాధితుల్ని పరామర్శించేందుకు వచ్చిన సీయం జగన్ తెలుసుకుంటే బావుండేదని స్థానికులు అంటున్నారు. ఇలావుంటే, అసలు పడవ ఎక్కింది 73 మంది కాదని, 93 మంది అని స్థానిక నేత, మాజీ ఎంపీ హర్షకుమార్ అంటున్నారు. టూరిజం మంత్రి అవంతి శ్రీనివాస్ వత్తిడితోనే అధికారులు 73 మంది అని చెబుతున్నారని హర్షకుమార్ ఆరోపణ.
అసలు ఈ బోటుకు దేవిపట్నం ఎస్సై అనుమతి ఇవ్వకపోతే, మంత్రి అవంతి ఒత్తిడితోనే అనుమతి లభించిందని హర్షకుమార్ ఆరోపించారు. లెక్కకు మించి మృతదేహాలు బయటపడుతాయన్న ఉద్దేశంతోనే బోటును బయటకు తీయకుండా సాకులు చెప్తున్నారని బాంబ్ పేల్చారు.
ఐతే, దీనిపై అవంతి ఘాటుగా స్పందించారు. హర్షకుమార్ ఆరోపణల్లో నిజమే లేదని, ఏదైనా ఆధారాలు వుంటే బయటపెట్టాలని అన్నారు. తన తప్పు ఉందని తేలితే ఎటువంటి శిక్షకైనా సిద్ధమని ప్రకటించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసిన హర్షకుమార్‌పై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.