బీఆర్ఎస్ నాయకుల అంతర్గత కుమ్ములాటలు ఈ మధ్య సభలు,సమావేశాల్లోనే బహిర్గతమవ్వడం చర్చనీయాంశంగా మారుతుంది. పరిగి గులాబీ నేతల మధ్య వార్ మర్చిపోక ముందే మహబూబాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేకు మాజీ ఎంపీకి మధ్య వాగ్వివాదం బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళన సమావేశంలో చోటుచేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
మాజీ ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్యే శంకర్ నాయక్ మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఇది ఇవాళ మహబూబాబాద్ జిల్లా గూడూరులో బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మెళనంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్, పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే ఈ సభలో మాజీ ఎంపీ సీతారామ్ నాయక్ మాట్లాడుతుండగా మధ్యలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ కల్పించుకున్నారు.
దీంతో ఆగ్రహించిన మాజీ ఎంపీ.. మంత్రి సమక్షంలోనే ఎమ్మెల్యే పై రుసరుసలాడారు. నీ నోరే గట్లనా.. నీ నోరే గట్లుంటాదా.. అంటూ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై సీతారాం నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలు, సమావేశాల్లో ప్రోటోకాల్ పాటించాలని స్టేజ్ పైనే ఎమ్మెల్యే కు హితబోధ చేశారు. రెండు నిమిషాలు ఓపిక పట్టరాదు..అంటూ చురకలు అంటించారు.
కొన్ని సార్లు మాట్లాడేటప్పుడు కొంత ప్రోటోకాల్ పాటించాలని, ఎందుకు ఊకే.. ప్రతీ దాంట్లో ఏదో ఒకటి చేస్తావ్ అని మండిపడ్డారు. మనది 5 సంవత్సరాల నుండి స్నేహం, నిన్ను ఐదేళ్లలో 24 గంటలూ కాపాడుతూ వచ్చానంటూ సీతారామ్ నాయక్ చెప్పారు. ఇక అంతకు ముందు సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే గూడూరు మండలం ఐటిడిఏ నిధులు మంజూరు చేయాలంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ను రిక్వెస్ట్ చేశారు.