మాజీ ఎంపీ, సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత మరోసారి చట్టసభలకు వచ్చేందుకు సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేశారు. రాజ్యసభ ఎంపీగా కవితకు అవకాశం దక్కుతుందన్న ఊహాగానాలు సాగినప్పటికీ… తాను ఓడిన నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా కవిత బరిలోకి దిగబోతున్నారు. ఈ మేరకు టీఆర్ఎస్ అధికారికంగా కవిత పేరును ప్రకటించింది.
కవితను ఎమ్మెల్సీగా పంపటం వెనుక సీఎం కేసీఆర్ బలమైన వ్యూహాం ఉందన్న అభిప్రాయం వినపడుతోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి పీఠం నుండి తప్పుకొని కేటీఆర్‌కు పగ్గాలు అప్పజెప్పనున్నారన్న ప్రచారం ఉంది. అయితే… ఈ పట్టాభిషేకం జీహెచ్‌ఎంసీ ఎన్నికల వరకు వాయిదా పడిందని టీఆర్ఎస్ నాయకులంటున్నారు. దీంతో కవితను ఎమ్మెల్సీగా చేస్తే… రాబోయే కేటీఆర్ క్యాబినెట్‌లో కవితకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు కట్టబెట్టడం ద్వారా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కేటీఆర్, ఆ తర్వాత స్థానం కవితలకే ఉండేలా సీఎం కేసీఆర్ వ్యూహా రచన చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే ఇద్దరు మహిళలు రాష్ట్ర క్యాబినెట్‌లో ఉన్నప్పటికీ… కొత్త మంత్రి వర్గంలో కవితకు ఛాన్స్ పక్కగా ఉన్నట్లేనని… తద్వారా కవిత ఎప్పటి నుండో కోరుకుంటున్న మంత్రి పదవి కోరిక కూడా తీరుతుందని విశ్లేషకుల అంచనా.
అయితే, మాజీ ఎంపీ కవితను నిలువరించేందుకు కాంగ్రెస్, బీజేపీలు చేతులు కలిపే అవకాశం నిజామాబాద్‌లో స్పష్టంగా కనపడుతున్నాయి. మొత్తం 824ఓట్లు ఉండగా… టీఆర్ఎస్‌కు 592, బీజేపీ 90, కాంగ్రెస్‌కు 142మంది ఉన్నారు. అయితే… గతంలో టీఆర్ఎస్ నుండి ఎమ్మెల్సీ అయిన భూపతి రెడ్డి కాంగ్రెస్‌లో చేరటం ద్వారా ఉప ఎన్నిక వచ్చింది. టీఆర్ఎస్ పట్టుబట్టి తన పదవిని పోగొట్టిందన్న కసితో ఉన్న భూపతి రెడ్డి తన వర్గాన్ని ఇప్పుడు కవితకు వ్యతిరేకంగా నడిపించే యోచనలో ఉన్నట్లు నిజామాబాద్ వర్గాల సమాచారం.
దీంతో… ఓవైపు కేసీఆర్ తన కూతురు భవిష్యత్‌కు బంగారు బాటలు వేసే పనిలో ఉంటే, ప్రతిపక్షాలు ముఖ్యంగా టీఆర్ఎస్ ఎంపీ డి. శ్రీనివాస్, బీజేపీ ఎంపీ అరవింద్ కవితను నిలువరించి… నిజామాబాద్‌పై తమ పట్టును నిలుపుకునేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.