తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సబితా వ్యాఖ్యలపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘సబితా ఇంద్రా రెడ్డి నిజంగా చదువుకోలేదు. ఆమె 10వ తరగతి ఫెయిల్ అయిన విద్యాశాఖ మంత్రి. ఆమెకు ట్విట్టర్‌ని ఎలా వాడాలో కూడా తెలీదు. ఇంగ్లీషులో ఎలా టైప్ చేయాలో రాదు. ఆమె ట్వీట్లను ‘తెలంగాణ క్రౌన్ ప్రిన్స్ ఇన్ వెయిటింగ్ ట్విటర్ ఆర్మీ’ టైప్ చేసింది. దయచేసి మంత్రి సబితాను క్షమించండి అంటూ ఎద్దేవా వేశారు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
కాగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పై సబితా ఇంద్రారెడ్డి విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అమ్మా నిర్మలా సీతారామన్ గారు.. తెలంగాణ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు. నేను, నా సహోద్యోగి సత్యవతి రాతోడ్. గత మూడేళ్లుగా కేసీఆర్ గారి చైతన్యవంతమైన నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలియకపోవడం దురదృష్టకరం అంటూ సబితా ఇంద్రా రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు.
అయితే ఇటీవల కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తన ఫాంహౌస్‌లో నల్లపిల్లితో క్షుద్రపూజలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై నిర్మలా సీతారామన్ కూడా మీడియాతో మాట్లాడుతూ.. ఆయన తాంత్రికుడి సలహాల మేరకు కేసీఆర్ పని చేస్తారని అన్నారు.