ఒడిశాలో బీజేపీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి గిరిధర్ గమాంగ్ షాక్ ఇచ్చారు. తాజాగా బీజేపీకి ఆయన గుడ్ బై చెప్పారు. త్వరలోనే ఆయన బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు.
2015లో గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఆయన తన కుమారుడితో కలిసి సమావేశమయ్యారు. ఈ క్రమంలో ఆయన తాజాగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడం గమనార్హం. ఆయనతో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామ చేశారు.
ఇద్దరు నేతలు త్వరలోనే బీఆర్ఎస్‌లో చేరబోతున్నట్టు సమాచారం. గిరిధర్ గమాంగ్‌కు దేశ రాజకీయాల్లో ఓ ప్రత్యేకత ఉంది. ఒడిశా నుంచి 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1972 నుంచి 2004 వరకు వరుసగా కోరాపుట్, లక్ష్మీపూర్ స్థానాల నుంచి ఎన్నికయ్యారు.
1999లో ఆయన పది నెలల పాటు ఒడిశాకు సీఎంగా కూడా పని చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ వ్యవహతీరు నచ్చకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. 2015లో ఆయన బీజేపీలో చేరారు. గిరిధర్ సతీమణి హేమ గమాంగ్ 1999లో ఎంపీగా వ్యవహరించారు.