కేంద్రంలోని మోడీ సర్కార్ ను ఢీ కొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ఏకం అవుతున్నట్లే అనిపిస్తోంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ విషయంలో ఓ అడుగు ముందుకేసి.. కేసీఆర్ సహా మిగిలిన నేతలను జట్టుగా చేస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు.
కేసీఆర్ తో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్ తో ఆదివారం ఫోన్ లో మాట్లాడారు మమత. ఈ విషయాన్ని ఆమే స్వయంగా తెలిపారు. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. దేశ సమాఖ్య స్వరూపం విచ్ఛిన్నానికి గురి కాకుండా తామంతా కలిసి ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
తాజాగా ఈ జట్టులోకి జేడీఎస్ వచ్చి చేరింది. మాజీ ప్రధాని, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ.. కేసీఆర్ కు ఫోన్ చేశారు. కేంద్రంపై పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. మతతత్వ శక్తుల మీద పోరాటాన్ని కొనసాగించాల్సిందేనన్న దేవెగౌడ… లౌకికవాద సంస్కృతిని, దేశాన్ని కాపాడుకునేందుకు అండగా ఉంటామని చెప్పారు. తాను త్వరలోనే బెంగళూరు వచ్చి కలుస్తానని కేసీఆర్ ఆయనకు చెప్పారు.
ప్రస్తుతం వీళ్లిద్దరి ఫోన్ కాల్ పై రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. విపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు జట్టు కడితే.. అది ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేది ఇప్పుడే చెప్పలేమని అంటున్నారు విశ్లేషకులు.