త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ పూర్వీకుల ఇంటికి కొందరు నిప్పు పెట్టారు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటనలో ఇల్లు చాలావరకు మంటల్లో దగ్ధమైంది. గోమతి జిల్లా .. ఉదయ్ పూర్ లోని ఈ ఇంట్లో దేవ్ తండ్రి సంవత్సరీకం నిర్వహిస్తున్న సందర్భంగా యజ్ఞం చేసేందుకు కొంతమంది పురోహితులు కూడా వచ్చారు. అయితే ఒక్కసారిగా ఓ గుంపు వారి వాహనాలను ధ్వంసం చేయడమే గాక,, ఈ ఇంటికి, సమీపంలోని కొన్ని షాపులకు కూడా నిప్పు పెట్టారు.
విపక్ష సీపీఎం పార్టీకి చెందిన కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఇంటితో బాటు షాపులు, కొన్ని కార్లు కూడా మంటల్లో దగ్ధమవుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానికులు పలువురు పురోహితులను రక్షించేందుకు, మంటలను ఆర్పేందుకు పరుగులు పెట్టారు.
దాడికి గురైన పురోహితుల్లో ఒకరైన జితేంద్ర కౌశిక్ మీడియాతో మాట్లాడుతూ.. యజ్ఞ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు తానిక్కడికి వచ్చానని, హఠాత్తుగా ఓ గుంపు వచ్చి తనపైన దాడి చేసిందని, తన వాహనాన్ని కూడా నాశనం చేశారని వాపోయారు. వీరిలో సీపీఎం కార్యకర్తలు ఉన్నారో లేరో తెలియదన్నారు.
కారు నుంచి దిగి తాను తప్పించుకోబోతుండగా తనపై రాళ్లు విసిరారని ఆయన చెప్పారు. ఈ దాడికి కారణం తెలియలేదు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.