కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించారన్న కోపంతో బీజేపీని వీడిన బాబుల్ సుప్రియో తృణమూల్ గూటికి చేరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని ప్రకటించి యూటర్న్ తీసుకున్న ఆయన… టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, ఎంపీ ఓబ్రెయిన్ సమక్షంలో ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించి కండువా కప్పుకున్నారు. బెంగాల్ కు సేవ చేయాలనే లక్ష్యంతోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రకటించారు.
2014లో బీజేపీలో చేరిన బాబుల్.. అసన్ సోల్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. అప్పట్లో మోడీ కేబినెట్ లో పట్టణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2019లోనూ గెలిచి సత్తా చాటారు. అప్పుడు కూడా కేంద్రమంత్రిగా కొనసాగారు. అయితే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బాబుల్ ను పోటీ చేయించింది అధిష్టానం. ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది. తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ ఘోష్ తో విభేదాలు తలెత్తాయి. అదే సమయంలో కేంద్ర కేబినెట్ విస్తరణ జరిగింది. మంత్రి పదవి నుంచి బాబుల్ ను తొలగించారు. దీంతో రాజకీయల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారాయన.
అప్పటినుంచి సైలెంట్ గా ఉన్న ఆయన.. తన నిర్ణయం మార్చుకుని టీఎంసీ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించిన ఆవేదనలో రాజకీయాలను వీడుతానని చెప్పిన మాట వాస్తవమేనన్న ఆయన.. బెంగాల్ ప్రజలకు సేవ చేసేందుకే వెనక్కి తగ్గినట్లు చెప్పారు. మమత, అభిషేక్ తనకు గొప్ప అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. అసన్ సోల్ అభివృద్ధే తన లక్ష్యమన్నారు బాబుల్.