కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ సోషలిస్టు నేత శరద్ యాదవ్ కన్ను మూశారు. ఆయన వయస్సు 75 సంవత్సరాలు. తన తండ్రి మరణించినట్టు ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన నిన్న ఢిల్లీలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను గురుగ్రామ్ లోని ఫొర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి తరలించారు.. అపస్మారక స్థితిలో శరద్ యాదవ్ ని తీసుకువచ్చారని, అప్పటికే ఆయన నాడి కొట్టుకోవడం లేదని, బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిపోయిందని ఆసుపత్రి ఓ స్టేట్మెంట్ లో వెల్లడించింది. డాక్టర్లు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని , రాత్రి 10.19 గంటల ప్రాంతంలో కన్ను మూశారని పేర్కొంది. దేశ సోషలిస్టు అగ్ర నేతల్లోఒకరైన శరద్ యాదవ్.. దశాబ్దాలుగా జనతా రాజకీయాల్లోకేంద్ర బిందువుగా ఉన్నారు.
లోక్ సభకు ఏడు సార్లు ఎన్నికయ్యారు. మూడు సార్లు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. మధ్యప్రదేశ్, యూపీ, బీహార్ .. మూడు రాష్ట్రాల నుంచి ఎంపీగా ఉన్న ఆయన.. 1990 లో అప్పటి ప్రధాని వి.పి.సింగ్ కేబినెట్ లో మంత్రిగా వ్యవహరించారు. ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మండల్ కమిషన్ సిఫారసుల అమలులో ఆయన కీలక పాత్ర వహించారు. భారత రాజకీయాలనే అది మార్చివేసింది. మహిళారిజర్వేషన్ బిల్లులో కుల ప్రాతిపదిక కోటా ఉండాలన్న ఆయన డిమాండ్ ఫలితంగా నాడు యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో ఈ చట్టంపై సర్కార్ వెనకడుగు వేసింది.
సామాజిక-ఆర్ధిక కుల ప్రాతిపదికన సెన్సస్ నిర్వహించాలని 2011 లో కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించిన వారిలో ఆయన కూడా ఒకరు. అయితే దీని ఫలితాలు వెలుగుకు నోచుకోలేదు. 1999 లోను, 2004 లోను నాడు వాజ్ పేయి ప్రభుత్వంలో శరద్ యాదవ్ పలు కీలక శాఖలు నిర్వహించారు.
2003 లో జేడీ-యు అధ్యక్షునిగా ఎన్నికైన ఆయన.. 2004 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోయారు. నాడు ఆయనకు నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యత్వం ఇప్పించారు. 2009 లోక్ సభ ఎన్నికల్లో శరద్ యాదవ్ మళ్ళీ విజయం సాధించారు. నితీష్ కుమార్ తో విభేదించి జేడీ-యు నుంచి బయటకి వచ్చిన ఆయన లోక్ తాంత్రిక్ జనతాదళ్ పేరిట సొంత పార్టీ ఏర్పాటు చేశారు. రెండేళ్ల అనంతరం లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీలో దాన్ని విలీనం చేశారు. శరద్ యాదవ్ మృతికి ప్రధాని మోడీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా అనేకమంది ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా భావ జాలం నుంచి యాదవ్ ప్రేరణ పొందారని మోడీ పేర్కొన్నారు. సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్… ఓ వీడియో మెసేజ్ విడుదల చేస్తూ తనకు, శరద్ యాదవ్ కు మధ్య విభేదాలు ఉన్నప్పటికీ అవి ఎప్పుడూ తమ మధ్య శత్రుత్వానికి దారి తీయలేదన్నారు.