దేశ రాజకీయాల్లో మరో శిఖరం ఒరిగిపోయింది. యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ అనారోగ్యంతో మేదాంత ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఓ సాధారణ కార్యకర్తగా రాజకీయ జీవితం మొదలు పెట్టి సీఎం స్థాయి వరకు ఎదిగారు.
ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి సమయంలో ఆయన 19నెలల పాటు జైలులో శిక్ష అనుభవించారు. తన పోరాట పటిమతో తిరుగులేని నేతగా ఆయన ఎదిగారు. ఎమ్మెల్యేగా పది సార్లు, ఎంపీగా 7 సార్లు గెలిచిన ఘనత ఆయన సొంతం.
యూపీకి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు తీసింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు యూపీ రాజకీయాలను ఆయన శాసించారు. 1939 నవంబర్ 22న యూపీలోని ఇటావా జిల్లాలో జన్మించారు.
పొలిటికల్ సైన్స్ లో ఎంఏ చేసిన ఆయన ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత రాం మనోహర్ లోహియా వంటి నేతల మార్గదర్శకత్వంలో ఓ గొప్ప నాయకుడిగా ఎదిగారు. 1967లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు.
ఆ తర్వాత 1977లో తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. ఆ తర్వాత 1980లో యూపీలో లోక్‌దళ్ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ఆ పార్టీ జనతా దళ్‌లో భాగమైంది. లోక్‌దళ్ పార్టీ చీలిపోగా ఆయన క్రాంతికారి పార్టీని ప్రారంభించారు. ఆ తర్వాత 1992లో సమాజ్‌వాదీ పార్టీని స్థాపించారు.
1989లో ఆయన తొలిసారి సీఎం అయ్యారు. ఆ తర్వాత 1993లో రెండోసారి.. 2003లో మూడోసారి సీఎం అయ్యారు. మూడవ సారీ సీఎంగా ఎన్నికైనప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. దీంతో నిబంధనల ప్రకారం… ఆరు నెలల్లోగా ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి వుండగా ఆయన గున్నౌర్ నియోజక వర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 94 శాతం ఓట్లతో ఘన విజయం సాధించడంతో దేశం మొత్తం ఆశ్చర్యపోయింది.