భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మరోసారి రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం హన్మకొండ జిల్లాలోని చైతన్య డీమ్డ్ వర్సిటీ 11వ స్నాతకోత్సవానికి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. మాతృభాషలోనే ప్రాథమిక విద్య మొదలు పెట్టాలని అభిప్రాయపడ్డారు.
ఇంగ్లీషు భాష నేర్చుకోండి తప్పు కాదు.. కానీ ఇంగ్లీష్ మన సంస్కృతి కాదని గుర్తుంచుకోండి అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరభాష వ్యామోహంలో మాతృ భాష, సాంస్కృతిని మర్చిపోవద్దని విద్యార్థులకు సూచించారు.
పేదలకు కూడా అందుబాటులో ఉండే విధంగా విద్యాసంస్థలు సహకరించాలన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణం.. సమాజంతో జర్నీ చేయక పోవడమేనని, సెల్ ఫోన్ కు బానిసలై సమయాన్ని వృథా చేస్తున్నారని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
జిల్లా కలెక్టర్లు ఎవరైనా సరే తెలుగులోనే మాట్లాడాలని కోరారు. కులమతాల పేరుతో కొన్ని రాజకీయ శక్తులు మనుషుల మధ్య ద్వేషాలు పెంచే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు వెంకయ్య.
రాజకీయాలంటేనే ప్రజల్లో అసహ్యం పెరుగుతోందన్నారు. రాజకీయ నాయకులపై గౌరవం తగ్గిపోతుందన్నారు. చట్ట సభలు.. యుద్ధ సభలుగా మారుతున్నాయన్నారు. బుల్లెట్ కంటే బ్యాలెట్ పవర్ ఫుల్ అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్ లీడర్ వెంకయ్య నాయుడు.