రాజకీయాల్లో ప్రస్తుతం విలువలు, సిద్ధాంతాలు లోపించాయని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వెంకయ్య పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉన్నతమైన ఆలోచనలు, నీతి, నిజాయితీతో దేశ గొప్పదనాన్ని కాపాడాలని రాజకీయ నాయకులను కోరారు వెంకయ్య.
ప్రపంచంలోనే అతి పెద్ద పార్లమెంటరీ వ్యవస్త కలిగిన దేశం మనదని, చట్ట సభల్లో మాట్లాడేటప్పుడు నాయకులు జాగ్రత్తగా ఉండాలని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని హుందాగా వ్యవహరించాలన్నారు వెంకయ్య నాయుడు. రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని… శత్రువులు ఉండరని అన్నారు.
కష్టపడితే విద్యార్థులు సాధించలేనిదేమీ లేదని, పట్టుదలతో ఏదైనా పొందవచ్చని పేర్కొన్నారు. మాతృభాష చాలా గొప్పదన్న వెంకయ్య… ప్రాథమిక స్థాయి వరకు విద్యార్థులకు మాతృభాషలోనే బోధన జరగాలని అభిప్రాయపడ్డారు. తాను, కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలమన్నారు.
కానీ తాము ఎక్కువగా మాతృ భాషలో మాట్లాడటానికే ఇష్టపడతామని ఆయన వెల్లడించారు. మాతృభాషను ప్రేమించాలని, ఇతర భాషలను గౌరవించాలని విద్యార్థులకు సూచించారు. కన్న తల్లి, జన్మభూమి, మాతృదేశాన్ని మరిచినోడు మానవుడే కాదని స్పష్టం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.