ఎల్కతుర్తి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ వద్ద వరంగల్ – కరీంనగర్ జాతీయ ప్రధాన రహదారిపై గోపాల్పూర్ గ్రామానికి చెందిన రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. గత 20 రోజులుగా కరెంటు సరఫరా నిలిచిపోవడంతో లక్షలు వెచ్చించి వేసిన పంట నీరు లేక ఎండిపోయే దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఏ అధికారిని అడిగినా కానీ కరెంటు వస్తుందని చెప్తున్నారు.
అంతే తప్ప తమకు పరిష్కార మార్గం చూపెట్టడం లేదని, తమ పంటలు కాపాడుకోవడం కోసం ధర్నా చేపట్టామని, వెంటనే అధికారులు స్పందించి తమ కరెంటు సరఫరా యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని రైతులను నచ్చదు చెప్పే ప్రయత్నం చేసినప్పటికి వారు వినకపోవడంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది.
దేశంలోనే వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం అని చెబుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలో పేరిట చార్జీలు వసూలు చేస్తూ కరెంటు సరఫరా లో వ్యవసాయానికి కోతలు విధించడంతో అన్నదాతలు రోడ్డెక్కి పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా అధికారులు స్పందించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.