హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో శనివారం ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. ఈ రేసింగ్ ని చూసేందుకు అభిమానులు ఎంతో ఉత్సాహంగా వచ్చినా.. అనుకోని చిక్కులు ఎదుర్కోవలసి వస్తుంది. టికెట్ కొనుగోలు చేసినా వెహికిల్ పాస్ కావాలంటూ ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వద్ద ప్రేక్షకులను పోలీసులు నిలిపివేస్తున్నారు. టికెట్ల కొనుగోలు సమయంలో ఈవెంట్ నిర్వాహకులు వెహికిల్ పాస్ ఇవ్వకపోవడంతో.. టికెట్లు కొన్నవారికి పార్కింగ్ చిక్కులు వచ్చి పడుతున్నాయి.
ఇంకోవైపు కార్ పార్కింగ్ కు నిర్వహకులు స్థలం కేటాయించకపోవడంతో సమస్యలు తలెత్తాయి. కార్లను ఎక్కడ పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితిలో అభిమానులు ఉన్నారు. దీంతో టికెట్లు కొన్న రేసింగ్ అభిమానులు అయోమయంలో పడ్డారు.
హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్న ఈ ఈవెంట్ ను చూసేందుకు భాగ్యనగరం వాసులు ఆసక్తి చూపుతున్నారు. గంటకు 300 కిలోమీటర్ల మెరుపు వేగంతో దూసుకుపోయే ఫార్ములా ఈ కార్ల విన్యాసం చూసేందుకు హైదరాబాద్ నగర వాసులు ఉత్సాహం చూపుతున్నారు. మొత్తం 22 మంది రేసర్లు ఈ పోటీలో పాల్గొంటున్నారు. శనివరాం జరగబోయే ఈ ఈవెంట్ కోసం పకడ్బందీగా ఏర్పాట్లు జరిగాయి. ప్రస్తుతం ఫార్ములా ఈ ప్రాక్టిసింగ్ రేస్ ముగిసింది. కాసేపట్లో ఈ క్వాలిఫాయింగ్ రేస్ ప్రారంభంకానుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి మెయిన్ రేస్ ప్రారంభంకానుంది.
మరోవైపు ఈ రేసింగ్ కారణంగా గత రెండు మూడు రోజులుగా వాహనదారులు భారీగా ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఫైఓవర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలు బ్లాక్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ఫార్ములా ఈ రేసింగ్ సందర్భంగా ఫ్లైఓవర్లు, రోడ్లను పోలీసులు, ఈ రేసింగ్ నిర్వాహకులు మూసివేయడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.