హైదరాబాద్ సాగర తీరాన నేటి నుంచి ఫార్ములా ఈ రేసింగ్ ప్రారంభం కానుంది. దేశంలోనే మొట్టమొదటి సారిగా జరిగే ఈ కార్ రేసింగ్ ట్రాక్‌ను ప్రత్యేకంగా, పకడ్బందీగా తీర్చిదిద్దారు అధికారులు. శుక్రవారం సాయంత్రం ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్ ప్రారంభమవుతుండటంతో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 2.25 నుంచి 5.15 వరకు ప్రాక్టీస్ ఉంటుంది. తిరిగి శనివారం ఉదయం 8:05 గంటల నుంచి 8:55 వరకు ఫార్ములా ఈ ప్రాక్టీస్ రేస్-2 జరగనుంది.
ఉదయం 10.40 నుంచి 11.55 వరకు క్వాలిఫైయింగ్ రేస్ జరుగుతాయి. రౌండ్ 4 పోటీలు శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు సాగనుంది. ఇప్పటికే మొదటి రౌండ్ మెక్సికో, రెండో, మూడో రౌండ్ దిరియా, నాలుగో రౌండ్ హైదరాబాద్ , ఐదో రౌండ్ కేప్ టౌన్ జట్లు గెలిచాయి. ఈ రేసులో మొత్తం 16 రౌండ్లు ఉండగా.. ఆఖరి రౌండ్ లండన్‌లో జరగనుంది. నాలుగో రౌండ్ హైదరాబాద్‌లో జరుగుతండగా.. ఐదో రౌండ్ సౌత్ ఆఫ్రికాలోని కేప్ టౌన్ తర్వాత బ్రెజిల్, బెర్లిన్, మోనాకో, జాకర్త, పోర్ట్ ల్యాండ్, లండన్ ఫార్ములా ఈ రేసింగ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో ఇప్పటికే అన్నిఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. మొత్తం 22,500 మంది ప్రేక్షకులు వీక్షించేలా గ్యాలరీలను ఏర్పాటు చేసింది. 1000 రూపాయల మొదలు లక్షా 25 వేల రూపాయల ధర కలిగిన టికెట్ల అమ్మకాలు చేపట్టింది. ప్రస్తుతం వెయ్యి, 4వేలు, 10,500 ధర ఉన్న టికెట్లు సోల్డ్ అవుట్‌గా చూపిస్తున్నాయి.
మరోవైపు ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి ప్రభుత్వం గట్టిగానే ప్లాన్ చేసింది. అందులో భాగంగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనదైన శైలిలో అదిరిపోయే ప్రమోషన్ ఇచ్చారు. ఈవెంట్ ప్రమోషన్స్ కోసం తమన్ కవర్ సాంగ్ ను సిద్దం చేశారు.తమన్ మాస్, క్లాస్ బీట్స్ ని మిక్స్ చేసి మంచి సాంగ్ ఇచ్చారు. ఈ పాటలో సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కూడా గెస్ట్ అప్పీరియన్స్ ఇవ్వడం హైలైట్ గా నిలిచింది. వీరిద్దరూ కలసి “హైదరాబాద్ జాన్ దేఖో ఫార్ములా-ఈ” అంటూ సాగే పాటకు చిన్నారులతో కలిసి స్టెప్పులేశారు. ఈ పాటను తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ పాటకు లక్షల్లో వ్యూస్ వస్తుండగా.. యూట్యూబ్ లో ట్రెండింగ్ గా మారింది.