పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించింది. ఈ సందర్భంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి మూడు పేజీల లేఖ రాశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టు కడుతున్నందున హైకోర్టు, సుప్రీం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు పడటానికి, పెనాల్టీ కట్టాల్సిన పరిస్థితికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంజనీర్ల కారణంగా ఎన్జీటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చ పడిందన్నారు. అయితే పలు అంశాలను పద్మనాభ రెడ్డి ఈ లేఖలో ప్రస్తావించారు.
1. ఇఎస్ సీఐ సమగ్ర సర్వే జరిపి జూరాల నుంచి 70 టీఎంసీల నీటిని వాడుకోవచ్చని డీపీఆర్ తయారు చేశారు. అయితే సీఎం కేసీఆర్ దానిని కాదని శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవాలని సూచించారు. ఇంత పెద్ద ప్రాజెక్టుపై నిష్ణాతుల రిపోర్టు కాదని.. రాజకీయ నిర్ణయం తీసుకోవడం సరైనది కాదన్నారు.
2. ముఖ్యమంత్రి శ్రీశైలంకు మార్చమన్నప్పుడు దానికి సరియైన సమగ్ర సర్వే జరపలేదు. ఆదరాబాదరాగా రెండు వారాల్లో శ్రీశైలం నుంచి 90 టీఎంసీల నీటిని తీసుకోవడానికి డీపీఆర్ తయారు చేశారు.
3. ఇంత పెద్ద ప్రాజెక్టును ఎటువంటి పర్యావరణ, ఇతర అనుమతులు లేకుండా మొదలు పెట్టారు. గుడ్డి ఎద్దు చేనులో పడిన చందాన పనులు చేశారు.
4. మోటారు పంపుల కొనుగోలులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు విచారణ జరపలేదు?
5. ప్రాజెక్టు పనిలో ఎలాంటి పారదర్శకత లేదు. ప్రాజెక్టు డీపీఆర్ కాపీ అడిగితే రూ.28 వేలు చెల్లించమన్నారు. ఇలాంటి పెద్ద ప్రాజెక్టు రకరకాల విమర్శలకు గురవుతున్నప్పుడు ప్రజలకు అన్ని విషయాలు తెలిసేలా వెబ్ సైట్ లోనే డీపీఆర్ పొందుపర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.
6. 90 టీఎంసీల్లో హైదరాబాద్ కి, పరిశ్రమలకు పోగా.. ఇంకా 70 టీఎంసీలు మాత్రమే మిగిలి ఉంటాయి. దీనితో ఏడు లక్షల ఎకరాల కంటే ఎక్కువ భూమి సాగు కాదు. ప్రభుత్వ లెక్కలు 10 లక్షల ఎకరాలకు నీరందిస్తామనడం తప్పుడు లెక్కలన్నారు.
7. చివరకు ఒక ఎకరాకు సాగునీటిని ఇవ్వడానికి రూ.8 లక్షల వరకు కాపిటల్ కాస్ట్ అవుతుందని, ఏటా విద్యుత్ ఖర్చు రూ.20 వేల వరకు అవుతుందని పేర్కొన్నారు.
8. ఏయే బ్యాంకుల నుంచి ఎంత అప్పుడు తీసుకున్నదీ, దానికి చెల్లించాల్సిన వడ్డీ వివరాలను కూడా వెల్లడించాలన్నారు.
ఈ ఆరోపణలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై శ్వేత పత్రాన్ని విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆ లేఖలో కోరారు.