రైతు బంధు పేరిట తెలంగాణ ప్రభుత్వం అనర్హులకూ లబ్ధి చేకూర్చుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించింది. రైతులకు ఈ పథకంతో లబ్ధి చేకూరుతున్నా.. అదే సమయంలో అవసరం లేని వారికి అందిస్తోందని అభిప్రాయపడింది. రైతు బంధు కోసం ఏటా రూ.15 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. భూస్వాములు, ఆదాయపు పన్ను చెల్లించేవారు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులకూ ఈ పథకాన్ని వర్తింపచేజయడం సరికాదని తెలిపింది. రైతు బంధు పథకంలో లోపాలు సవరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది.
నిరూపయోగంలో ఉన్న భూములు, పంట వేయని భూములకూ రైతు బంధు కింద డబ్బులు ఇస్తున్నారని.. దీంతో ప్రజాధనం దుర్వినియోగమవుతోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖలో చెప్పుకొచ్చింది . రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రైతుబంధు పథకం కేవలం పంటలు వేసిన భూములకు మాత్రమే ఇవ్వాలని కోరింది. ప్రధానమంత్రి కిసాన్ యోజనలో 5 ఎకరాలకు పైబడిన రైతులు, అలాగే రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగస్థులు, ఆదాయపు పన్ను చెల్లించే వారికి పెట్టుబడి సాయాన్ని ఇవ్వడంలేదని గుర్తు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కేంద్రంలాగే, షరతులతో కూడిన రైతుబందు అమలు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ .. గవర్నర్‌కు లేఖలో విజ్ఞప్తి చేసింది.