హైదరాబాద్ లో సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో అతి తక్కువ ధరలకే కొందరు సినీ పెద్దలకు భూములు కేటాయించింది ప్రభుత్వం. అలా.. స్టూడియో నిర్మాణం కోసం పద్మాలయ వారికి షేక్ పేట గ్రామంలోని సర్వే నెంబర్ 43లో 9.518 ఎకరాల భూమిని ఇచ్చింది. ఎకరం భూమిని కేవలం రూ.8,500 చొప్పున అలాట్ చేసింది. అయితే.. ఈ భూముల్లో కొంత ప్రవేట్ పరం అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాక్ష్యంగా పెద్ద పెద్ద భవంతులు కనిపిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి.
భూమి కేటాయింపు సమయంలో సబ్ రిజిస్ట్రార్, రిపోర్టు ప్రకారం ఆ స్థలం ఎకరాకు రూ.20 లక్షల విలువ ఉంది. హైదరాబాద్ నగరంలోని సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలనే ఏకైక కారణంతో అతి తక్కువ ధరకు ఈ భూమి ఇచ్చింది ప్రభుత్వం. భూమి బదలాయింపు పత్రంలో ఒకవేళ ఈ భూమిని సినీ పరిశ్రమకు కాకుండా ఇతర అవసరాలకు వాడితే అలాట్ మెంట్ రద్దు చేసి తిరిగి వెనుకకు తీసుకుంటామని స్పష్టంగా సూచించింది. అయితే.. పద్మాలయ స్టూడియో 5.53 ఎకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా జీ టెలీ ఫిల్మ్ వారికి వాణిజ్య అవసరాలకు అమ్మేసింది. వారు ఆ భూమిని ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థకు అమ్మగా అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు.
ఈ విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లగా.. తహసీల్దార్ ను నిర్మాణ పనులు ఆపేయాలని ఆదేశాలు జారీచేశారు. కొన్నాళ్లు గప్ చుప్ గా ఉన్న ఫినిక్స్ సంస్థ.. ఆ తర్వాత మళ్లీ మొదలుపెట్టి అక్కడ నిర్మాణాలు పూర్తి చేసింది. ఆ కట్టడాలకు జీహెచ్ఎంసీ అనుమతులు కూడా ఇచ్చింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు రాగా జిల్లా కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి 2014 ఫిబ్రవరి 5న ఎంక్వైరీ రిపోర్టు ప్రభుత్వానికి పంపారు. ఆ రిపోర్టులో పద్మాలయ స్టూడియో యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా భూమిని ఇతరులకు అమ్మినందుకు దాన్ని తిరిగి వాపసు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. కానీ.. కలెక్టర్ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అలాగే.. నగర పాలక సంస్థ నిర్మాణాలను ఆపడానికి ప్రయత్నం చేయలేదు.
సీసీఎల్ఏ దీనిపై తదుపరి విచారణ జరిపి అలాట్ మెంట్ చేసిన భూమి ఇతర అవసరాలకు వాడుతున్నందున పద్మాలయ స్టూడియోపై తగిన చర్యలు తీసుకోవాలని, అలాట్ చేసిన భూమిని వాపస్ తీసుకోవాలని 2015లో ఒక సుదీర్ఘ రిపోర్టు ఇచ్చింది. ప్రభుత్వం ఈ రిపోర్టుపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా వాణిజ్య బహుల అంతస్తుల నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది. కొందరు అవినీతి అధికారుల అండదండలతో ఈ వ్యవహారమంతా సాగుతున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనుమానిస్తోంది. ఈ క్రమంలో కార్యదర్శి పద్మనాభరెడ్డి లేఖ రాశారు.
ఈ వ్యవహారంలో వివాదాస్పద భూమి ఏ విధంగా బిల్డర్ కు రిజిస్ట్రేషన్ చేయబడింది? అలాగే జీహెచ్ఎంసీ అనుమతులు ఎలా ఇచ్చింది? కలెక్టర్, సీసీఎల్ఏ రిపోర్టులపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అనే విషయాలపై విజిలెన్స్ ద్వారా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వంలో పద్మాలయకు కొమ్ముకాస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు పద్మనాభరెడ్డి.