తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి లేఖ
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎటువంటి లాభాపేక్ష లేని స్వచ్చంద సేవా సంస్థ. పాలనలో పారదర్శకత, సుపరిపాలన, అధికార వికేంద్రీకరణ వంటి విషయాలపై పనిచేయడానికి కొందరు రిటైర్డ్ హైకోర్టు జడ్జి, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సామాజిక కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటైంది. అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులపై నమోదైన కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి సుప్రీం కోర్టు ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఒక ప్రత్యేక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసింది. గత నాలుగు సంవత్సరాలుగా హైదరాబాద్ లో ప్రత్యేక న్యాయస్థానం పనిచేస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ సభ్యులపై నమోదైన కేసుల వివరాలు వారి ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సేకరించి అధ్యయనం చేసింది.
1. 64 మంది శాసనసభ్యులపై 344 కేసులు
2. 10 మంది పార్లమెంట్ సభ్యులపై 133 కేసులు
3. మాజీ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులపై(సుమారు) 30 కేసులు ఉన్నాయి.
మొత్తం కేసులు 507 ఉన్నట్లు తేలింది. అయితే సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఈ కేసులన్నీ ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కావాలి. కానీ.. ఇంతవరకు కేవలం 380 మాత్రమే బదిలీ అయ్యాయి. ఇక ఈ కేసులలో తీర్పు గురించి పరిశీలించగా..
1. కోర్టుకు వచ్చిన 380లో 338 కేసులలో తీర్పు వెలువడింది.
2. తీర్పు చెప్పిన 338 కేసులలో 14 కేసులలో శిక్ష పడింది (4%) మిగిలిన 324 కేసులు వీగిపోయాయి(96%).
శిక్ష విధించిన 14లో 4 కేసులలో జైలు శిక్ష పడగా 10 కేసులలో జరిమానా విధించారు. జైలు శిక్ష పడినవారు హైకోర్టును ఆశ్రయించి స్టే పొందారు.
ఉదాహరణగా ఒక కేసు:
హైదరాబాద్ జిల్లా చాంద్రాయణ గుట్ట అసెంబ్లీ నియోజకవర్గం శాసన సభ్యుడు 31-3-2004 నాడు పబ్లిక్ మీటింగ్ లో రెండు వర్గాల మధ్య విద్వేషం రగిలించే ఉద్దేశంతో “లాల్ దర్వాజాను ఆకుపచ్చ దర్వాజాగా మారుస్తాను. ఒకవేళ వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్.. హిందువులకు త్రిశూలం పంచినా అప్పుడు నేను ముస్లింలకు చిన్న తల్వార్లు(కత్తులు) పంచుతాను” అని మాట్లాడారు. దీనిపై సెక్షన్ 153- ఏ, 188 ఐ.పి.సి, సెక్షన్ 125, ప్రజాప్రాతినిధ్యం చట్టం కింద కేసు నమోదైంది. మీటింగ్ లో ఆయన మాట్లాడిన మాటలన్నీ వీడియోగ్రఫీ చేయబడ్డాయి. ఈ కేసు ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి కోరగా సుమారు 10 సంవత్సరాలు నాన్చి.. 2014లో అనుమతి ఇచ్చింది. ఆ తరువాత నాలుగు సంవత్సరాలకు 2018లో అదనపు మెట్రోపాలిటిన్ జడ్జి ముందుకు కేసు రాగా ఆయన ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని పేర్కొంటూ చార్జి ఫ్రేమ్ చేశారు. కేసు విచారణలో ఉండగా ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటుతో ఈ కేసును బదిలీ చేశారు. ప్రత్యేక న్యాయస్థానం జడ్జి 16-11-2021 నాడు తీర్పు చెపుతూ ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు ఇవ్వనందున కేసు కొట్టివేయడం జరిగిందని తెలిపారు. 2004 సంవత్సరంలో నమోదైన కేసు 17 సంవత్సరాల తరువాత కొట్టి వేయబడింది. ప్రత్యేక న్యాయస్థానంలో కేసులు వీగిపోతున్న విషయాలన్నీ రాష్ట్ర గవర్నర్ దృష్టికి జూలై 2021 నాడు లేఖ ద్వారా తెలియజేశాం. అయినా పరిస్థితిలో మార్పు ఏమీ లేదు.
ప్రత్యేక న్యాయస్థానంలో ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ వహించకపోవడంతో కేసులన్నీ వీగిపోతున్నాయి. దీనిపై ప్రాసిక్యూషన్ వారు సాక్షులను, ఆధారాలను కోర్టులో సరైన పద్ధతిలో ప్రవేశపెట్టి నిందితులకు శిక్షపడేలా చూడాలని.. అలాగే కొట్టివేసిన తీవ్రమైన కేసులలో ముఖ్యమైన వాటిపై, కోర్టుకు అప్పీలు చేయడానికి ఆదేశాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కోరుతోంది.