కబ్జాకి గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి తెలంగాణ గవర్నర్ కి లేఖ రాశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపట్టి ఎస్.కే. సిన్హా కమిటీ ప్రభుత్వానికి నివేదిక కూడా సమర్పించిందని లేఖలో వివరించారు. కానీ ఇంత వరకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని తెలిపారు.
కబ్జాకి గురైన భూములను తిరిగి వెనక్కి తీసుకొని వచ్చి.. కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు. రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో సర్వే నం. 191, 297లో రెవెన్యూ అధికారులు, భూ కబ్జాదారులతో కుమ్మక్కై 200 ఎకరాల ప్రభుత్వభూమిని మింగేశారని తెలిపారు. నకిలీపత్రాలతో ఏడు కంపెనీలకు పట్టాలు చేసి, వారి పేరున రెవెన్యూ దస్త్రాలలో మ్యుటేషన్ చేయడం జరిగిందని వివరించారు.
ఈ వివరాలు కూడా ఎస్.కె. సిన్హా కమిటీ ప్రభుత్వానికి తెలియజేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమేనని ఇలాంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా జరిగాయని.. వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జాకి గురైయ్యాని లేఖలో తెలిపారు. ప్రభుత్వం దగ్గర అన్ని వివరాలు ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఆక్రమణలకు గురైన భూములు తిరిగి ప్రభుత్వం చెంతకు చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.