తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరుగుతోందని మాజీ ఐఏఎస్ ల సంఘం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఆరోపించింది. పారదర్శకత, జవాబుదారీతనం లేక అవినీతి జరుగుతుందని ఈ మేరకు గవర్నర్ ను కోరింది.
17,895కోట్ల అంచనా వ్యయంతో 12.2లక్షల ఎకరాలకు నీరిచ్చేందుకు ఈ ప్రాజెక్ట్ చేపట్టారని, 160టీఎంసీల ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్క ఎకరాకు నీరిచ్చేందుకు ప్రభుత్వం ఏకంగా 1.46లక్షలు ఖర్చు చేస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టు అంచనా వ్యయం 80,190కోట్లకు చేరిందని.. 61,740కోట్లు ఇప్పటికే ఖర్చు చేశారని, కాలువలు ఇంకా నిర్మించినందున పొలాలకు ఇంకా నీరే అందటం లేదని తెలిపింది.
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఈ ప్రాజెక్టును సమర్థిస్తుందని, అయితే… ప్రాజెక్ట్ ఖర్చుతో పాటు ఇతర వివరాలు గోప్యంగా ఉంచుతున్నారని పేర్కొంది. రాత్రికి రాత్రే ప్రాజెక్ట్ అంచనాలు పెరిగిపోతున్నాయని, ప్రజల ఆస్తి అవినీతిపరులకు చేరకుండా ఉండేందుకే తాము ఈ శ్వేతపత్రం విడుదల చేయాలని కోరుతున్నామని తెలిపింది.
అంచనాలు ఇలాగే పెంచుకుంటూ పోతే… ప్రాజెక్ట్ ఖర్చు ఏకంగా లక్షకోట్లకు చేరనుందని గవర్నర్ కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.