14 ఏళ్ల పాటు నిర్విరామంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. కండ్లకోయలో నిర్మించబోయే ఐటీ పార్కుకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఫలితంగానే నేడు ఈ ఐటీ పార్కును నిర్మించుకోగలుగుతున్నామని అన్నారు. కేసీఆర్ 2001లో టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించినప్పుడు ఆయన వద్ద ఏం లేదు. కానీ.. నేడు ఆయన వెంట నాలుగున్నార కోట్ల జనాభా ఉందన్నారు. ప్రజల మద్దతుంటే ఏదైనా సాధించుకోవచ్చని కేసీఆర్ నిరూపించారని పేర్కొన్నారు.
ఉత్తర హైదరాబాద్ లో 35 ఇంజినీరింగ్ కాలేజీలు, 50 ట్రెడిషనల్ డిగ్రీ కాలేజీలు, 30 ఎంబీఏ కాలేజీలతో పాటు.. పలు ఫార్మసీ, మెడికల్, నర్సింగ్ కాలేజీలు ఉన్నాయన్నారు. ప్రతీ ఏడాది 15 నుంచి 20 వేల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వెళ్తున్నారని తెలిపారు. నార్త్ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగాలు కల్పించేలా నగరానికి నలువైపులా ఐటీ పార్కులు నిర్మిస్తున్నామన్నారు కేటీఆర్. ఈ గేట్ వే ఐటీ పార్కు ద్వారా వేలాది మంది పిల్లలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు.
ఈ ప్రాంతంలో మంచి యూనివర్సిటీలు ఉన్నాయని అన్నారు. దగ్గర్లోనే ఎంఎంటీఎస్, జాతీయ రహదారులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి ఉజ్వల భవిష్యత్ ఉందని కేటీఆర్ అన్నారు. గత ఏడున్నరేండ్లలో ప్రపంచంలోనే టాప్ 5 కంపెనీలతో పాటు.. అనేక కంపెనీలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. యాపిల్, గూగుల్, అమెజాన్, ఫేస్ బుక్, మైక్రోసాప్ట్ లాంటి కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని అన్నారు.
అమెజాన్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ను హైదరాబాద్ లో నెలకొల్పిందని అన్నారు. 31 లక్షల చదరపు అడుగుల్లో దీన్ని ఏర్పాటు చేశారని చెప్పారు కేటీఆర్. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం తెలంగాణలో ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. దీన్ని మూడున్నరేండ్లలోనే పూర్తి చేయనున్నామని అని తెలిపారు. కాళేశ్వరం నుంచి గజ్వేల్ కు నీళ్లు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ కు మాత్రమే దక్కుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.