అడవితల్లి దర్శనం కోసం తండోపా తండాలుగా తరలివచ్చే మహా జాతర మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర.. మరి జాతర మొదలవుతుంది అంటేనే అధికారుల హడాహుడి ఎలా ఉంటుందో తెలిసిందే. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అధికార యంత్రాంగం పనులల్లో బిజీబిజీగా ఉంటారు. అలాంటిది జాతర పనులు మొదలవ్వడంతో జిల్లాకు పెద్ద దిక్కయిన కలెక్టర్ బదిలీ. మరొకరికి ఇంచార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు.ఇంచార్జ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి నాలుగు సంతకాలు పెట్టేలోపే ఆయన ట్రాన్స్ఫర్…ఇలా మొత్తంగా నలభై రెండు రోజుల్లో నలుగురు కలెక్టర్ల బదిలీలు జరిగిన జిల్లా ఏదైనా ఉందంటే అది ములుగు జిల్లానే.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారంపై అందరి చూపు ఉంటే.. కొందరి చూపేమో కలెక్టర్ల మార్పుపై పడింది. అసలే వెనుకబడిన ప్రాంతం, ఎన్నో ఏళ్ల తర్వాత నెరవేరిన కలతో ఏర్పడిన జిల్లా. తెలంగాణ రాష్ట్రంలోనే అతి చిన్నజిల్లా. 17 ఫిబ్రవరి 2019 నుంచి ఉనికి లోకి వచ్చిన జిల్లా. ములుగు జిల్లా. తొలుత జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు ములుగు జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించినా కొద్ది రోజులకే పూర్తిస్థాయి కలెక్టర్‌గా సి.నారాయణరెడ్డిని నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే మేడారం జాతర పనులు ప్రారంభమయ్యాయి. అంతలోనే గతేడాది (2019) డిసెంబర్22న ఆయన్ను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ గా ట్రాన్స్ఫర్ చేశారు. మేడారం జాతర అభివృద్ధి పనుల్లో నిక్కచ్చిగా వ్యవహరించడంతో గిట్టని రాజకీయ నాయకులు నారాయణరెడ్డిని బదిలీ చేయించారనే ఆరోపణలు వచ్చాయి. నారాయణరెడ్డి కేవలం 9 నెలల 18 రోజులు మాత్రమే ములుగు జిల్లాలో పనిచేశారు.ఆయన స్థానంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లుకు మళ్ళీ ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా డిసెంబర్ 24న బాధ్యతలు అప్పగించారు. ములుగు జిల్లా ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే వాసం వెంకటేశ్వర్లు సైతం మేడారం జాతర పనులపై దృష్టి పెట్టారు.పనులను వేగవంతం చేయించడానికి కృషి చేశారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో రెండు చోట్ల జెండావిష్కరణ సైతం చేశారు.ఇంతలోనే ములుగు జిల్లా ఇన్చార్జి బాధ్యతల నుంచి వెంకటేశ్వర్లును తప్పించి, ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్‌కు జనవరి 28న ములుగు జిల్లా ఇన్ చార్జి కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఇది జరిగిన వెను వెంటనే కేవలం 5 రోజుల వ్యవధిలోనే ములుగు జిల్లాకు ఉట్నూరు ఐటీడీఏ పీఓ కృష్ణ ఆధిత్యను నియమించారు. కృష్ణ ఆధిత్యను నియమించినప్పటికీ ములుగు జిల్లా ఇంచార్జ్ గా మేడారం పర్యవేక్ష బాధ్యతలు మాత్రం ఆర్.వి. కర్ణన్ నే చూసుకున్నారు.
Advertisements
2018 మేడారం మహా జాతర ముందు కూడా అప్పటి భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళిని ప్రభుత్వం ఇలాగే బదిలీ చేసింది. అప్పట్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న ఆర్వీ కర్ణన్‌కు భూపాలపల్లి ఇన్చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు.ఇన్చార్జి కలెక్టర్‌గా మేడారం జాతరను ఆయనే లీడ్ చేశారు.ఇదే సాంప్రదాయాన్ని తాజాగా ప్రభుత్వం కొనసాగించింది. 2020 మహాజాతర ముందు కూడా కర్ణన్కే అవకాశం కల్పించడం విశేషం.నాడు కలెక్టర్‌గా జాతర ను సక్సెస్ చేయడం వల్లే ఆయనకు మరోసారి ఛాన్స్ ఇచ్చారని కొందరు చెబుతున్నా.. మరికొందరు మాత్రం జిల్లా పంచాయతీ అధికారిని సస్పెండ్ చేయాలని తాను ఆదేశించినా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు పట్టించుకోకపోవడం వల్లే వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఓ మంత్రికి కోపం వచ్చి ఆయనను ఇన్చార్జి బాధ్యతలనుంచి తప్పించారని మరికొందరు చెబుతున్నారు. కేవలం 42రోజుల్లో నలుగురు కలెక్టర్లు మారడంపై జిల్లాలో చర్చ జరుగుతోంది. బదిలీలతో పాలనపై, జాతరపై ప్రభావం ఉంటుందని ఆందోళన చెందినప్పటికీ సమ్మక్క, సారలమ్మ ల జాతర మాత్రం విజయవంతంగా జరిగింది. అసలే మేడారం జాతర…కోట్ల రూపాయలతో పనులు…మాటా వింటే ఉంటాడు.. వినకపోతే ట్రాన్ఫర్. మంత్రికి కోపం వచ్చినా… ఎవరికి కోపం వచ్చినా చివరకు బలయ్యేది మాత్రం అధికారులే. నీతిగా,నిజాయితీగా పనిచేసిన అధికారులకిచ్చే నిలువెత్తు గిఫ్ట్ ట్రాన్స్ఫర్. ఇలా తయారయ్యాయి ఉమ్మడి ఓరుగల్లు జిల్లా రాజకీయలు.
మొత్తానికి సమ్మక్క-సారలమ్మ జాతరతో ములుగు జిల్లా గొప్పతనం వివిధ రాష్టాలకు ఎలా వ్యాపించిందో.. అదే మాదిరిగా ములుగు జిల్లా కలెక్టర్ల బదిలీల వ్యవహారం ఉమ్మడి ఓరుగల్లు జిల్లా వాసులకే కాకుండా.. జాతరకు వచ్చిన భక్తులకు సైతం అర్ధమైంది.