తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ పాదయాత్రకు బ్రేక్ పడింది. పాదయాత్రకు నాలుగు రోజులు విరామం ప్రకటించారు లోకేష్. ఈ నెల 27, 28 తేదీల్లో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరుగుతుంది. దీంతో లోకేష్ విరామం ప్రకటించారు. తిరిగి ఈనెల 30న జమ్మలమడుగు నుంచే పాదయాత్ర ప్రారంభించనున్నారు.
ప్రస్తుతం నారా లోకేష్ పాదయాత్ర కడప జిల్లాలోని జమ్మలమడుగులో కొనసాగుతుండగా.. గురువారం పాదయాత్ర ముగించుకుని కడప ఎయిర్ పోర్టుకు బయల్దేరి వెళ్లారు లోకేష్. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని అక్కడ నుండి అమరావతికి చేరుకోనున్నారు. శుక్రవారం అమరావతి నుండి బయలుదేరి రాజమండ్రిలో జరిగే మహానాడు ప్రాంతానికి వెళ్లనున్నారు లోకేష్.
కాగా గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేష్ పాదయాత్ర కొనసాగింది. పెద్ద ఎత్తున దళితులు, మైనార్టీలు, రైతులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తానని లోకేష్ హామీ ఇచ్చారు.