కేంద్రపాలిత ప్రాంతం డామన్ లో విషాదం నెలకొంది. జంపోర్ తీరంలో నలుగురు అమ్మాయిలు చనిపోయారు. మొత్తం ఐదుగురు బాలికలు సరదాగా సముద్రంలోకి దిగారు. వారిలో నలుగురు కొట్టుకుపోయారు. ఒకరిని ఇతర కుటుంబసభ్యులు రక్షించారు.
మృతులు దామన్ కు చెందిన మహిరా ఖురేషి(11), ఫిజా షేక్ (17), సబీనా ఖురేషి(15), జైనాబ్ షేక్(20) గా గుర్తించారు. వీరిలో ఒకరు ఉత్తరప్రదేశ్ వాసి. ఒక్కసారిగా అలలు వారిని ముంచేయడంతో కొట్టుకుపోయారని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ అమిత్ శర్మ తెలిపారు.
తమకు సాయం చేయాలని కేకలు వేసినా ఒక్కరు కూడా ముందుకు రాలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. బీచ్ లో పోలీసులే లేరని చెప్పారు. వాటర్ బోట్లు నడిపే ఏజెన్సీని సాయం కోరినా వారు కూడా ముందుకు రాలేదని వాపోయారు.
బీచ్ లో సైన్ బోర్డు గానీ, హెల్ప్ లైన్ నెంబర్ గానీ ఏవీ లేవని తెలిపారు కుటుంబసభ్యులు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.