జమ్ముకశ్మీర్లో పోలీస్ జావెద్ దర్ హత్యకు అధికారులు రివేంజ్ తీర్చుకున్నారు. జావేద్ హత్యకు కారణమైన ఉగ్రవాదులను ఆర్మీ అధికారులు ఎన్ కౌంటర్ లో మట్టుపెట్టారు. మొత్తం రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. అందులో ఒకటి కశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలోని మోలూ ప్రాంతంలో జరిగింది.
జైషే మహ్మద్ కు చెందిన మరో ముగ్గురు ఉగ్రవాదుల్ని డ్రాచ్ ప్రాంతంలో భద్రతా సిబ్బంది హతమార్చారు. ఇందులో ఇద్దరిని హనన్ బిన్ యాకూబ్, జంషెద్గా అధికారులు గుర్తించారు. ఈ నెల 2న పుల్వామాలోని పింగ్లానా ప్రాంతంలో పోలీసు జావెద్ దర్ ను ఉగ్రవాదులు హత్య చేశారు.
గత నెల 24న పుల్వామాలో వలస కూలీలను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ రెండు కేసుల్లో యాకూబ్, జంషెద్ నిందితులని పోలీసులు వెల్లడించారు. మరోవైపు మోలూ ప్రాంతంలో ఉగ్ర కదలికలపై సైన్యానికి విశ్వసనీయ సమాచారం అందింది.
దీంతో బుధవారం ఉదయం జమ్ముకశ్మీర్ పోలీసులు, ఇతర భద్రతా దళాలకు చెందిన సిబ్బంది కలిసి సంయుక్తంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఓ చోట దాక్కుని ఉన్న ఉగ్రవాదులు ఆర్మీ అధికారులను చూసి కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా సిబ్బంది ప్రతిగా కాల్పులు జరిపారు. ఇందులో ఓ ముష్కరుడు మరణించాడు.