తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు కరెంట్ షాక్ ఘటనలు అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. విద్యుదాఘాతంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కరెంట్ షాక్ తగిలి ఓ ఫ్యామిలీ అంతా చనిపోయారు. ఇద్దరు ముక్కుపచ్చలారని చిన్నారులు సహా తల్లిదండ్రులు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఆటో డ్రైవర్ గా పని చేసే హైమద్ తన కుటుంబంతో గత కొన్నేండ్లుగా బీడీ వర్కర్స్ కాలనీలో నివాసముంటున్నారు. హైమద్ కు భార్య పర్వీన్(30), అద్నాన్(4), మాహిమ్ (6) అనే పిల్లలు ఉన్నారు. అయితే మాయదారి విద్యుత్ వారి కుటుంబంలో విషాదం నింపింది.
ఇంటిలో ఇనుప తీగపై బట్టలు ఆరవేసే క్రమంలో పిల్లలు ప్రమాదానికి గురయ్యారు. వారి ఇల్లు రేకుల షెడ్డు కావడంతోపాటు అక్కడే ఫ్యూజ్ వైర్ కు ఇనుప తీగ తగిలి విద్యుత్ సరఫరా అయింది. ఆ ఇనుప తీగ ఊడి పోయి మహిమ్ పై పడడంతో విద్యుత్ షాక్ కు గురైంది. ఇది గమనించిన అద్నాన్ మహిమ్ ను ముట్టుకోవడంతో అతను కూడా షాక్ కు గురయ్యాడు. వీరిద్దరినీ రక్షించబోయిన తల్లిదండ్రులు కూడా విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ కాలనీలో విషాదచాయలు అలుముకున్నాయి.
స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి మృతదేహాలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.