సైబర్ నేరాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఆయాస పడకుండా సంపాదించే ఆదాయ మార్గంగా ఈ దొడ్డిదారిని ఎంచుకుంటున్నారు దుండగులు. షర్ట్ నలగ కుండా, చెమటపట్టకుండా కూర్చున్న చోటే కోట్లు కొల్లగొడుతున్నారు కేటుగాళ్ళు. మాయమాటలు చెప్పి తాజాగా హైదరాబాద్ లో నలుగురి దగ్గర్నుంచి రూ.70 లక్షలు కొట్టేసారు.
అందిన సమాచారం ప్రకారం. నగరంలోని వేర్వేరు చోట్ల ఉంటున్న నలుగురికి ఇటీవల వర్క్ ఫ్రమ్ హోం, దండిగా డబ్బు సంపాదించే అవకాశం అంటూ వాట్సాప్, టెలిగ్రామ్ యాప్ ల నుంచి సందేశాలు వచ్చాయి.
ఆసక్తి ఉన్నవారు మేము పంపిన నెంబర్ కి డయల్ చెయ్యండి అంటూ మోసగాళ్లు ఫోన్ నెంబర్లు ఇచ్చారు. ఇది చూసి నలుగురు వారిని సంప్రదించారు. నెలకు వేలల్లో సంపాదించవచ్చు.
అయితే కొంత డబ్బు డిపాజిట్ చెయ్యాల్సి ఉంటుందని వీరి నుంచి మోసగాళ్లు 70 లక్షలు గుంజారు. ఆ తరువాత కాంటాక్ట్ లో లేకుండా పోయారు. అప్పుడు మోసపోయినట్టు గుర్తించిన బాధితులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.