ఆదిలాబాద్ లో పులుల సంచారం కలకలం రేపుతోంది. భీంపూర్ మండలంలోని గొల్లఘాట్ శివారులో ఏకంగా నాలుగు పులులు సంచరిస్తున్నాయి. గురువారం అర్థరాత్రి పులులు రోడ్డు దాటుతుండగా.. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వాటిని చూశాడు. వెంటనే తన సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. ప్రస్తుతం పులులు సంచరిస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డీటైల్స్ లోకి వెళ్తే.. పిప్పల్ కోటి రిజర్వాయర్ పనుల కోసం ఓ డ్రైవర్ మట్టి తరలిస్తున్నాడు. ఈ క్రమంలో గొల్లఘాట్ కు చేరుకోగానే నాలుగు పులులు రోడ్డు దాటడం గమనించాడు. పులులు రోడ్డు దాటడాన్ని వెంటనే తన ఫోన్ లో వీడియో తీశాడు డ్రైవర్. అనంతరం ఈ సమాచారాన్ని అటవీ శాఖ అధికారులకు అందించాడు.
పులులు సంచరిస్తున్న విషయం తెలుసుకున్న అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని.. పులుల అడుగులను పరిశీలించారు. పులుల సంచారం నిజమేనని నిర్థారించుకున్నారు. అనంతరం గ్రామస్తులకు పలు ఆదేశాలు జారీ చేశారు. గొల్లఘాట్ గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు రాత్రి పూట అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని సూచించారు. పులులను పట్టుకునేంతవరకూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు.
కాగా రెండు నెలల కిందట ఇదే ప్రాంతంలో నాలుగు పులులు సంచరించిన విషయం తెలిసిందే. తిప్పేశ్వర్ అడవుల నుంచి పెన్ గంగ దాటి తరచూ ఈ ప్రాంతానికి పులులు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళ పనులపై బయటకు వెళ్తున్న వారిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. పులుల సంచారంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.