నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని చిత్తనూర్ గ్రామ శివారులో నిర్మించబడుతున్న ఇథనాల్ కంపెనీకి అక్రమంగా నీరు తరలిస్తున్నారని.. నాలుగు గ్రామాలకు చెందిన ప్రజలు ఆందోళనకు దిగారు. జూరాల నుంచి కోయిల్ సాగర్ వెళ్లే కెనాల్ మీదుగా ఎలాంటి పర్మిషన్లు లేకుండా పైప్ లైన్ పనులు చేస్తున్నారు.
దీంతో నాలుగు గ్రామాల నుంచి ప్రజలు పెద్దఎత్తున వచ్చి నిరసన తెలిపారు. ఈ క్రమంలో గ్రామస్తులకు, పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులకు తీవ్రంగా గాయాలయ్యాయి. అలాగే ఒక మహిళపై కూడా ఎస్ఐ దాడి చేశారు.
మహిళపై దాడితో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డు మీద బైఠాయించి ఆందోళన ఉధృతం చేశారు. అధికారులు వచ్చేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని ఎక్లాస్ పూర్ గేటు దగ్గర నిరసన తెలిపారు. దీంతో పోలీసుల వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించగా.. అక్కడికి మానవ హక్కుల వేదికకు సంబంధించిన అధికారులు వచ్చారు.
అనంతరం మరికల్ మండలం ఎమ్మార్వోతో మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏక్లాస్ పూర్, చిత్తనూర్, రాంపుర్, కనుమనూర్, జిన్నారం గ్రామాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.