నగరంలో నిత్యం ఏదోక మూల వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొంత కాలం క్రితమే కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు విడిచారు. ఇంకా ఆ సంఘటనల గురించి మరిచిపోకముందే మరో చోట కుక్కల దాడి జరిగిందనే వార్తలు వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని కంచన్ బాగ్ పరిధిలో ఐదేళ్ల చిన్నారి పై వీధి కుక్కలు దాడి చేశాయి.
వివరాల ప్రకారం..పాతబస్తీ రక్షాపురానికి చెందిన ఐదేళ్ల బాలుడు కుటుంబ సభ్యులతో కలిసి డీఆర్డీవో టౌన్ షిప్ లో ఓ వేడుకకు హాజరయ్యాడు. అక్కడ పరిసర ప్రాంతాల్లో కొందరు చిన్నారులతో కలిసి ఆడుకుంటున్నాడు.
ఈ క్రమంలో అక్కడే ఉన్న ఐదు కుక్కలు ఒక్కసారిగా బాలుడి పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. దీనిని గమనించిన స్థానికులు వాటి బారి నుంచి బాలుడిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.