వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురై నేటికి నాలుగేళ్ళు నిండింది. ఈ రక్తచరిత్రలో పాత్రధారులు చిక్కినా.. సూత్రధారులు మాత్రం ఇంకా చిక్కలేదు. బాధిత కుటుంబ సభ్యులు, అనుమానితులు పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణలతో కోర్టు మెట్లెక్కడంతో.. కేసు తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. వివేకా హత్య కేసులో మూడు సిట్ లు చేసిన దర్యాప్తు, ప్రస్తుతం సీబీఐ విచారణ సాగుతున్న తీరు సహా, నాలుగేళ్ల పరిణామాలను చూస్తే.. కేసు ఎన్నో మలుపులు తీసుకుంటూనే ఉంది.
2019 మార్చి 14 అర్థరాత్రి పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్ వివేకానంద రెడ్డి దారుణహత్యకు గురయ్యారు. ఉదయం 6 గంటల 15 నిమిషాలకు వివేకా పీఏ కృష్ణా రెడ్డి ద్వారా హత్య జరిగిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది.ఇక 6 గంటల 29 నిమిషాలకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిలతో పాటు పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఘటనా స్థలికి చేరకున్నారు. అయితే గుండె పోటుతో వివేకా చనిపోయారని ముందు ప్రచారం జరిగింది.
అందుకు మృతదేహానికి కుట్లు వేసి, బ్యాండేజ్ చుట్టి, ఇంట్లోని రక్తపు మరకలు తుడిచివేశారని, ఈ వ్యవహారంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలున్నాయి. అయితే పలు అనుమానాలతో సిట్ లు వేయడంతో పాటు చివరికి ఈ కేసును సీబీఐ కి అప్పగించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు హంతకులు ఎవరనేది దర్యాప్తు సంస్థలు తేల్చలేకపోయాయి. మొత్తంగా 100 మంది సాక్షులు, 1461 మంది అనుమానితులను విచారించినా హంతకులు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు.
ఇక ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వాళ్లు అప్రూవర్లుగా మారి..సీబీఐకి కీలక సమాచారాన్ని ఇస్తున్నారు. దీంతో కేసు విచారణ ఈ మధ్యే వేగవంతంగా ముందుకు సాగుతుంది. అయితే ఈ కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయల సుపారీ ఆఫర్ చేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పారని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దీంతో ఈ కేసు కీలక మలుపు తిరిగింది. ప్రస్తుతం సీబీఐ అధికారులు అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిపై ఫోకస్ పెట్టారు. మరి ఎప్పటికి ఈ కేసు ఓ కొలిక్కి వస్తుందన్న ఆసక్తి నెలకొంది.